నాణ్యమైన ఉన్నత విద్య, వ్యక్తిగత సాఫల్యంతో పాటు, సమాజానికి ఉత్పాదక సహకారాన్ని అందించాలని.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(governer bishwabushan harichandan) అన్నారు. విద్యార్థులను అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవనశైలి కోసం సిద్ధం చేయవలసిన బాధ్యత విద్యాసంస్ధలపై ఉందన్నారు. “విజన్ ఆఫ్ ఎన్ఇపీ 2020 ఆన్ రీసెర్చ్ అండ్ ఎక్స్ ట్రా కరిక్యులర్ పారామీటర్స్ ఫర్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్” అనే అంశంపై నిర్వహించిన సదస్సులో.. రాజ్ భవన్ నుంచి వెబినార్ విధానంలో గవర్నర్ పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం-2020 దేశంలోని యువ తరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు, దూరదృష్టితో భారత ప్రభుత్వం రూపొందించిన విధానాలలో ఒకటని అన్నారు.
దేశంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు వ్యవస్థను పునరుద్ధరించడం, నేపథ్య పరిస్థితుల కారణంగా ఎవ్వరూ చదువుకు దూరం కాకుండా చూడటమే ప్రధాన ఉద్దేశమన్నారు. 2030 నాటికి పాఠశాల విద్యలో.. 100 శాతం స్థూల నమోదు లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు నూతన విద్యావిధానం దోహదపడుతుందన్నారు. సంపూర్ణ విద్య సమ్మిళిత, సంస్కారవంతమైన, ఉత్పాదక, ప్రగతిశీల, సంపన్న దేశాన్ని నిర్మించేలా చేస్తుందన్నారు.
నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్ని విశ్వవిద్యాలయాలలో పరిశోధనా సంస్కృతి విస్తరించేలా చూసే లక్ష్యంతో నాణ్యమైన అకడమిక్ పరిశోధనను ఉత్ప్రేరకపరుస్తుందన్నారు. సామాజిక సవాళ్లైన.. పరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, మెరుగైన రవాణా, మౌలిక సదుపాయాలు వంటి సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలన్నారు. జాతీయ విద్యా విధానం-2020 దేశంలోని విద్యా రంగాన్ని మారుస్తుందనడంలో సందేహం లేదని, విద్యను అందుబాటులోకి తీసుకురావడం, సమానత్వంతో అందరినీ కలుపుకు పోవడంపై ఇది దృష్టి సారిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.
72వ టీబీ సీల్ సేల్ క్యాంపెయిన్ ప్రారంభం
గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్.. 72వ టీబీ సీల్ సేల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్ధలం కేటాయింపునకు సహకారం అందిస్తున్న గవర్నర్‌కు.. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.బాలచంద్ర ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ అధ్యక్షులు డాక్టర్ అరుణ్ కుమార్ కాంతి మొహంతికి.. ప్రత్యేక ఉత్తమ సంస్థాగత అవార్డును అందజేశారు. మానపల్లిలోని ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ డా.బి.వెస్లీకి ఉత్తమ సంస్థాగత అవార్డు, చిలకలూరిపేటలోని ఎఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సీఓఓ డాక్టర్ మసిలామణికి వ్యక్తిగత పురస్కారం అందించారు.
ఇదీ చదవండి:
CM Jagan: ప్రతీ గ్రామంలోని డిజిటల్ లైబ్రరీకి.. ఇంటర్నెట్ ఇవ్వండి: ముఖ్యమంత్రి జగన్