ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీటిని అందించటంతో పాటు బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మనం గణనీయమైన ప్రగతిని సాధించామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో 'పరిశుభ్రత విషయాలు' అనే ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక స్థాయిలో హైదరాబాద్ కేంద్రంగా యూనిసెఫ్ 7వ 'వాష్' సదస్సు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో విజయవాడ రాజ్‌భవన్ నుంచి వెబినార్ ద్వారా గవర్నర్ బిశ్వ భూషణ్ ప్రసంగిచారు.
2024 నాటికి అందరికీ సురక్షితమైన, తగినంత తాగునీటిని అందించడం, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో మనం- మన పరిశుభ్రత, కర్ణాటకలో స్వచ్ఛోత్సవ నిత్యోత్సవ, తెలంగాణలోని పల్లె ప్రగతి వంటి రాష్ట్రస్థాయి కార్యక్రమాలు ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించడానికి దోహదం చేస్తున్నాయి. వాష్ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించటానికి నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత రంగాల సిబ్బందిని సమన్వయ పరచటం అత్యావశ్యం. కరోనా మహమ్మారి మానవాళికి సవాల్ విసిరింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. మూడు రాష్ట్రాలు వంద శాతం మేర వాష్ లక్ష్యాలను సాధించాలి - బిశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్
ఇదీ చదవండి