Governor: ప్రతిభావంతులను వ్యవస్థకు అందించేలా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పని చేయాలని.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోరారు. విశాఖపట్నం వేదికగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుల స్టాండింగ్ కమిటీ సదస్సు జరిగింది. ఈ సదస్సులో విజయవాడ రాజ్‌భవన్ నుంచి వర్చువల్ మోడ్‌లో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ.. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు విధులు నిర్వర్తించాలని సూచించారు.
ప్రభుత్వపరమైన ఉద్యోగ నియామకాల్లో పబ్లిక్ సర్వీస్ కమీషన్లు కీలక భూమిక పోషిస్తాయని, ప్రతిభకు పెద్దపీట వేసేలా నియామక ప్రక్రియలు కొనసాగాలని గవర్నర్ సూచించారు. కాలానుగుణ నోటిఫికేషన్లు, సకాలంలో నియామకాలు పూర్తి చేయటం పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రధాన బాధ్యతలలో ఒకటని అన్నారు. పత్రికా ప్రకటన మొదలు అభ్యర్ధికి ఉద్యోగ నియామక పత్రం అందించే వరకు ప్రతి అంశంలోనూ పారదర్శకత, సమగ్రత, విశ్వసనీయత తప్పనిసరన్నారు.
రాష్ట్ర పీఎస్‌సీల 24వ జాతీయ సదస్సును.. 2023లో నిర్వహించనున్నట్లు గోవా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జోస్ మాన్యుయెల్ నొరోన్హా తెలిపారు. విజయవాడ రాజ్‌భవన్ నుంచి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, విశాఖపట్నం నుండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వసుధా మిశ్రా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధ్యక్షులు ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: