భగవంతుని దయతోపాటు ప్రజల ఆశీస్సుల మూలంగానే వాహన ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడినట్లు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాల గురించి వాకబు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు.
"ఎందుకూ పనికిరావని భావించే కంపచెట్లే నా ప్రాణాన్ని నిలబెట్టాయి. కేవలం సంపద కోణంలోనే కాకుండా మానవ మనుగడకూ వృక్షాలు కీలకం. వాటి ఆసరాగా ప్రాణాలతో బయటపడ్డ నేనే అందుకు ఉదాహరణ."
-బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ పర్యటనలో భాగంగా.. నల్గొండలో పౌరసన్మాన కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన వాహనం అదుపు తప్పింది. రహదారి కింద గల పొదల్లోకి దూసుకుపోయింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ సమీపంలోని ఖైతాపురం వద్ద ఘటన చోటు చేసుకుంది. ప్రసార మాధ్యమాల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు తన క్షేమ సమాచారాన్ని చరవాణిలో వాకబు చేశారు. వారందరికీ బండారు దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం