కొత్త సంవత్సరం మొదట్లోనే రాజకీయంగా, పాలనా పరంగా కీలక పరిణామాలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశాలున్నాయి. జనవరి మూడో తేదీన రిజర్వేషన్లను ఖరారు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆ తర్వాత నోటిఫికేషన్ల జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.
బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19 శాతం, ఎస్టీలకు 6.77 శాతం మేర రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం హైకోర్టుకూ సమర్పించింది. వార్డులు, గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి జనవరి మూడో తేదీలోగా ప్రభుత్వం ప్రకటన జారీచేసే అవకాశముంది.
సంక్రాంతికి ముందే నోటిఫికేషన్...
సంక్రాంతిలోగా నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. గడచిన కేబినెట్ సమావేశాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల గురించి కీలకమైన చర్చ జరిగింది. జనవరి తొమ్మిదో తేదీ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉంటాయని... గతంలోనే సీఎం జగన్ సంకేతాలిచ్చారు. అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు... ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచి, చివరి దశలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.
ఇటీవల తలెత్తిన అంశాలు స్థానిక సంస్థల్లో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రారంభించనున్న అమ్మఒడి పథకంతో పాటు... మూడు రాజధానుల అంశంపైనా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఇవీ చదవండి....మొదట పంచాయతీ ఎన్నికలే..!