TIDCO HOUSES: రాష్ట్రవ్యాప్తంగా పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో) ఆధ్వర్యంలో పురపాలక సంఘాల్లో చేపట్టిన ఇళ్లకు రుణాన్ని ఇచ్చేందుకు రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) తిరస్కరించిందంటూ.. బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి. ఫలితంగా రుణ సేకరణతోనే టిడ్కో ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అందించే ఆలోచన చేస్తున్న ప్రభుత్వానికి అప్పు పుట్టడం కష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ హామీతో రూ.6 వేల కోట్లు అప్పుగా ఇవ్వాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆశ్రయించిన టిడ్కోకు ఆర్‌బీఐ అడ్డుకట్ట వేసినట్లు తెలిసింది.
బడ్జెట్ సపోర్ట్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తే కుదరదని, అప్పును తిరిగి చెల్లించేందుకు ఆయా సంస్థల వద్ద పక్కాగా వనరులు ఉంటేనే ముందుకు వెళ్లాలని ఆర్‌బీఐ సూచించినట్లు బ్యాంకు అధికారులు టిడ్కో అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఆర్‌బీఐ నుంచి తమకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవని, కేవలం బ్యాంకు అధికారులు మౌఖికంగానే ఈ విషయాన్ని చెబుతున్నారని టిడ్కో అధికారులు పేర్కొంటున్నారు.
రూ.10 వేల కోట్లు కావాలి.. రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టగా అందులో 80 వేలకు పైగా గృహాలు గత ప్రభుత్వ హయాంలోనే 90 శాతంపైగా పూర్తయ్యాయి. వీటితోపాటు 75%, 50%పైగా పూర్తయినవి, మిగతా వాటిని పూర్తి చేయడానికి రూ.10 వేల కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో రూ.4 వేల కోట్ల వరకు లబ్ధిదారుల పేరిట బ్యాంకులు రుణంగా ఇవ్వాల్సి ఉంది.
మరో రూ.6 వేల కోట్లు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకోవాలని టిడ్కోకు ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారుల పేరు మీద ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్లలోనూ ఏడాది నుంచి అధికారులు ప్రయత్నిస్తుంటే ఇప్పటివరకు రూ.900 కోట్ల వరకు మాత్రమే రుణంగా ఇచ్చాయి.
భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి.. టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి వాటి మీద వచ్చే భవిష్యత్తు ఆదాయాన్ని బ్యాంకులకు హామీగా పెట్టి రూ.6 వేల కోట్ల రుణం తీసుకోవాలని చేసిన ప్రయత్నానికి గండిపడింది. గృహ సముదాయాల పూర్తి తర్వాత ఇంటి మెయింటెనెన్స్ ఛార్జీలు, పార్కు ప్రవేశ రుసుములు, కమ్యూనిటీ హాళ్లు, వాణిజ్య స్థలాల అద్దె ద్వారా వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలనే ప్రతిపాదన చేశారు. ఇలా దాదాపు 10 బ్యాంకులను రుణం కోసం ఆశ్రయించారు.
ఈ ప్రతిపాదనను ఆయా బ్యాంకులు తిరస్కరించినట్లు తెలిసింది. రుణానికి సమానమైన విలువున్న భూముల్ని తనఖా పెట్టి మార్టిగేజ్ చేయాలని బ్యాంకు అధికారులు టిడ్కోకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ విషయాన్ని టిడ్కో అధికారులు ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లారు.
ఇక హడ్కోనే దిక్కు.. టిడ్కోకు ఇప్పటివరకు నాన్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి మాత్రమే రుణం అందింది. హడ్కో, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లు మాత్రమే రుణాలిచ్చాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల పరంగా చూస్తే ఐసీఐసీఐ మాత్రమే రూ.300 కోట్ల వరకు రుణాన్ని మంజూరు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణమిచ్చేందుకు వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో ఎక్కువగా హడ్కో వైపే అధికారులు చూస్తున్నారు.
ఇదీ చదవండి: