పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన సత్తెమ్మకు కడుపు నొప్పి వచ్చి రక్తస్రావం అయింది. బంధువులు ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహా మేరకు ఆమెను తణుకు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మరలా సత్తెమ్మను ఏలూరుకు తరలించారు. తీరా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా.... వెంటనే విజయవాడకు తీసుకెళ్లాలని వైద్యులు బాధితులకు సూచించారు. ఇలా ప్రతీ చోటా... ప్రభుత్వాసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం వహించి.. బాధితురాలికి నరకం చూపించారు.
స్కానింగ్ రిపోర్ట్ లేదని వైద్యం నిలిపివేత
విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న సత్తెమ్మను 4 రోజుల పాటు చెక్క బల్ల ఉంచారు. రక్తస్రావం అధికంగా జరిగినందున రక్తాన్ని ఎక్కించి... ఆపరేషన్ చేయాలని సత్తెమ్మను సిద్ధం చేశారు. తీరా ఆమెను ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లి స్కానింగ్ రిపోర్ట్ లేదని ఆపరేషన్ నిలిపివేశారు. బయటకు వచ్చిన వైద్యులు.. రోగి బంధువులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు స్కానింగ్ గురించి ఎవరూ చెప్పలేదని రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు
గతంలోనూ ఇదే నిర్లక్ష్యం
ఆసుపత్రిపై ఆరోపణలు రావటం ఇది మొదటిసారి కాదు. గతంలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత మంచంపై నుంచి కిందపడి మరణించింది. గుణదలకు చెందిన ఓ మహిళ కవలలను ప్రసవిస్తే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయారని బాధితులు ఆరోపించారు.