రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు రైల్వే శాఖ ఆరోగ్యతనిఖీ యంత్రాలను ఏర్పాటు చేసింది. విజయవాడ, సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ సహా పలు ప్రధాన రైల్వే స్టేషన్లో ఆరోగ్యపరీక్ష యంత్రాలు ఏర్పాటు చేశారు. టీంలీడ్ కార్పోరేట్స్ సంస్థ ముందుకొచ్చి వీటిని ఏర్పాటు చేస్తోంది. ప్రతి యంత్రం వద్ద ఇద్దరు సిబ్బందిని నియమించి పరీక్షలు చేయడం సహా... ఆరోగ్య పరంగా సలహాలు సూచనలు ఇస్తున్నారు.
రూ.50 చెల్లిస్తే బీపీ, షుగర్, పరీక్షలు చేయడం సహా... దేహంలోని లోపాలను తెలియజేస్తారు. ఎత్తు, బరువు, దేహంలో ఉన్న కొవ్వు, ప్రోటీన్లు, విటమిన్లు, నీరు, మినరల్స్ స్థాయిని తెలియజేస్తున్నారు. పల్స్ స్థాయి సహా... మెదడు పరిస్ధితి, జ్ఞాపక శక్తి స్థాయి స్థితిగతుల సమాచారం ఇస్తున్నారు. కండరాల పటుత్వాన్నీ తెలియజేస్తున్నారు. ఆందోళన కరమైన అంశాలు ఉంటే... వాటిని ఎలా సరిదిద్దుకోవాలో అక్కడి సిబ్బంది తెలియజేస్తున్నారు. ఏం చేయాలో... ఏం చేయకూడదో తెలియజేస్తూ... రిపోర్టు ఇవ్వడం ఈ కేంద్రాల ప్రత్యేకత.
ఈ తరహా యంత్రాలు ఏర్పాటు చేయడం బాగుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రయాణికుల స్పందన ఆధారంగా యంత్రాలు పెంచేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ముందుగా పెద్ద రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసి... ఆ తర్వాత మిగిలిన వాటిలో అవసరమైన చోట ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ... 'వైకాపా బాధితుల తరఫున మేమే పోరాడతాం'