కృష్ణా జిల్లా గన్నవరం వైకాపా నేతల పంచాయితీ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయానికి చేరింది. ఎమ్మెల్యే వంశీ, దుట్టా రామచంద్రరావుకు సీఎంవో నుంచి ఫోన్లు వెళ్లాయి. వంశీ, రామచంద్రరావుతో గురువారం సీఎం జగన్ మాట్లాడే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా గన్నవరం వైకాపా నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పరస్పర దాడులు, పోటాపోటీ కార్యక్రమాలతో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు రచ్చకెక్కారు. ప్రస్తుతం గన్నవరం వైకాపా ఇన్‌ఛార్జిగా ఎమ్మెల్యే వంశీ ఉండగా..వంశీని కాకుండా మరొకరిని నియమించాలని వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10న వంశీ వ్యతిరేక వర్గం 'చలో తాడేపల్లి'కి పిలుపునిచ్చిన తెలిసిందే. దీంతో వైకాపా అధిష్ఠానం రంగలోకి దిగి.. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇరువురు నేతలతో సీఎం జగన్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
లేఖ వైరల్: గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అప్పగించొద్దంటూ జగనన్న అభిమానులు, వైకాపా కార్యకర్తల పేరిట ఎంపీ విజయసాయిరెడ్డికి కొందరు రాసిన లేఖ ఇటీవల వైరల్‌గా మారింది. తొమ్మిదేళ్ల పాటు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని కాపాడామని వారు లేఖలో పేర్కొన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే.. తెదేపా నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ.. వైకాపాకు మద్దతు ప్రకటించారని ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ జెండా మోసిన వైకాపా కార్యకర్తలు.. ఇప్పటికీ అక్రమ కేసుల వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా కుదేలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి నియోజకవర్గ బాధ్యతలను.. వల్లభనేని వంశీకి తప్ప ఎవరికి కేటాయించినా.. 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో పార్టీని కాపాడేందుకు సత్వరమే నూతన ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి