భాష కనుమరుగైతే అందులో అంతర్భాగమైన కళలు, సంస్కృతి అంతరించిపోతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు. కళలు.. మంచితనాన్ని, స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ముద్రించిన సాహితీ తపస్వి పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం మొదటి భాగాన్ని విజయవాడలో శనివారం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జస్టిస్ ఎ.వి.శేషసాయి మాట్లాడుతూ.. మన రాష్ట్రం జానపదాలకు పుట్టినిల్లని కొనియాడారు. పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం మొదటి భాగాన్ని చదువుతున్నంత సేపూ వెన్నెల్లో కృష్ణా విహారానికి నావలో వెళ్లినట్లుందని వ్యాఖ్యానించారు. జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ.. పోలవరపు రాసిన సమకాలీన అంశాలు, కథలు, నవలలు అన్నింటినీ గ్రంథరూపం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. జమీందారి వ్యవస్థలో నాటి స్థితిగతులను కళ్లకు కట్టినట్లు ఆయన రచనల ద్వారా లోకానికి చాటేవారని తెలిపారు. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణ, సాహితీ వేత్తలు గుమ్మా సాంబశివరావు, వెన్నా వల్లభరావు, పోలవరపు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: