రాష్ట్రంలో దిశ చట్టం దశ తప్పిందని... వెంటనే ఎత్తేయాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని బొమ్మూరులో 10 ఏళ్ల బాలికను వైకాపా ఆకతాయిలు వేధిస్తే... ఆ చిన్నారి తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధాకరమన్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే కుటుంబ పెద్ద ఎస్పీ కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. బాలికను వేధించిన వారి వెనుక ఎమ్మెల్యే సోదరుడి హస్తముందని ఆరోపించారు.
అతనే చందు అనే వ్యక్తితో ఇలాంటి దారుణాలు చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. తన కుమార్తెను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని, కోరుతూ బాలిక తండ్రి ఎస్పీకి లేఖ రాసినా స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వదిలేసి, బాలిక తండ్రిని మానసికంగా, శారీరకంగా హింసించారని జవహర్ ఆరోపించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ మైనారిటీ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చర్యకు ప్రతి చర్య జరిగేలోగా ప్రభుత్వం స్పందించాలని హెచ్చరించారు.
ఇదీ చదవండి: