రాష్ట్ర అవసరాలకు సరిపడా పశుగ్రాసం అందించడమే లక్ష్యంగా.. రాబోయే ఐదేళ్లలో రూ.250 కోట్లతో 'ఫాడర్ సెక్యూరిటీ పాలసీ 2021-26' అమలు చేస్తున్నట్లు పశు సంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. ఇందులో భాగంగా వేసవి, కరవు సమయాల్లో పశుగ్రాసం లభ్యమయ్యేలా చూడటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పశుగ్రాసం ఉత్పత్తి పెంచడం, వ్యవసాయ అనుకూల వాతావరణ పరిస్థితులను వినియోగించడం వంటి అమలు చేయన్నుట్లు తెలిపారు. పంట కోతల అనంతర చర్యల నిర్వహణ, ఉత్పత్తి ఖర్చులు తగ్గించడం, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం వంటి వాటిని కూడా ఇందులో భాగంగా చేస్తున్నామని ఆమె వివరించారు.
రాష్ట్రంలో కరవు నివారణ, పశుగ్రాసం కొరత తీర్చేందుకు గానూ ఆర్‌బీకేల ద్వారా 75శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుందని పూనం మాలకొండయ్య చెప్పారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫాడర్ బ్యాంకుల ద్వారా సైలేజ్ బేల్స్ నిల్వచేసి, వాటిని అవసరమైన రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి మిగులు గ్రాసాన్ని, కొరత ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా సరఫరా చేస్తామన్నారు.
కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం, ఎన్ఎల్ఎం పథకాల ద్వారా పశుగ్రాస అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పూనం మాలకొండయ్య వెల్లడించారు. రూ.773.94 కోట్లతో ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో శాశ్వత పశుగ్రాస పెంపకం చేపడతామని ఆమె అన్నారు. పాడి పరిశ్రమ ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందని, ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలతో రాబోయే ఐదేళ్లలో పాలు, మాంసం దిగుబడి రెట్టింపవుతుందని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.
అమర్‌రాజా సంస్థలకు విద్యుత్ పునరుద్ధరణ