రాష్ట్రంలో తొలిదశ పల్లెపోరు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో.. 168 మండలాల పరిధిలో పోలింగ్ జరగనుంది. తొలిదశలో 3 వేల 249 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా...525 ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు జిల్లా వెలిచెర్లలో ఎవరూ నామినేషన్లు వేయకపోవడం వల్ల పోలింగ్ జరగడం లేదు. మిగిలిన 2 వేల 723 పంచాయతీలు, 20 వేల157 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. 7 వేల 506 మంది సర్పంచ్ అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 32 వేల 502 వార్డుల్లో 12 వేల 185 ఏకగ్రీవమయ్యాయి. 160 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. మిగిలిన 20 వేల 157 వార్డుల్లో 43 వేల 601 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగిస్తున్నారు. ఈసారి బ్యాలెట్ పత్రంలో నోటానూ చేర్చారు. తొలి దశలో 70 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది.
పల్లె పోరుకు తొలిదశలో 29 వేల 732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. వీటిలో 3 వేల 458 సున్నితమైన, 3 వేల 594 అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం 519 మంది జోనల్ అధికారులు, 11 వందల 21 మంది రూట్ అధికారులతో పాటు..3వేల 47 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత కరోనా బాధితులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లలో ఉన్న 20 మండలాల్లో 336 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. 916 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 10 లక్షల 61 వేల 529 మంది ఓటు వేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం రెవెన్యూ డివిజన్‌లోని 12 మండలాల్లో 198 పంచాయతీలు, 4 వేల 452 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 239 పంచాయతీలకు ఎన్నికల ప్రకటన ఇవ్వగా..41 ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలో 83 సమస్యాత్మక, 7అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో 296 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాల్లోని 282 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 321 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా..39 ఏకగ్రీవమయ్యాయి. 2 వేల 958 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... మొత్తం 4 లక్షల 93 వేల 732 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కృష్ణా జిల్లాలో విజయవాడ రెవెన్యూ డివిజన్‌లో 14 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 234 పంచాయతీల్లో 23 ఏకగ్రీవమవగా..మిగిలిన 211 పంచాయతీలకు ఎన్నికలు జరుపుతున్నారు. 545 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నందున...భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. గుంటూరు జిల్లా తెనాలి రెవెన్యూ డివిజన్‌లో 18 మండలాల్లో 270 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ అధికారులకు కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ దినేష్ కుమార్ సూచనలు చేశారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లో 14 మండలాల్లోని 192 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 227 పంచాయతీలకు 35 ఏకగ్రీవమయ్యాయి. పర్చూరు నియోజకవర్గంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు.
నెల్లూరు జిల్లా కావలి రెవెన్యూ డివిజన్‌లోని 9 మండలాల్లో 137 పంచాయతీలు, వెయ్యి 34 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 162పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా... 25 ఏకగ్రీవమయ్యాయి. 920మంది అభ్యర్తులు పోటీ పడుతున్నారు. జిల్లాలో 13 వందల 70పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 380 అతి సమస్యాత్మక, 148స మస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.
చిత్తూరు జిల్లాలో 20 మండలాల్లో 454 పంచాయతీలకు 112 ఏకగ్రీవమయ్యాయి. 342 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 925 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు 137 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 117 కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కదిరి డివిజన్‌లో 169 పంచాయతీల్లో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 17 వందల 14 వార్డుల్లో 715 ఏకగ్రీవం కాగా... 15 వార్డులకు ఒక్కరూ నామినేషన్ వేయలేదు. 163 పంచాయతీలకు 984 వార్డులకు పోలింగ్ జరుగనుంది. సర్పంచి స్థానాలకు 462 మంది, వార్డులకు 2వేల 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు.
కడప జిల్లాలో జమ్మలమడుగు, కడప, రాజంపేట రెవెన్యూ డివిజన్లలోని 14 మండలాల్లో..155 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 206 పంచాయతీలకు గానూ 51 ఏకగ్రీవం కాగా... మిగిలిన పంచాయతీల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లలోని 12 మండలాల్లో 193 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా... 51 సర్పంచ్, 722 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 142 పంచాయతీలు, 12వందల వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు పెట్టారు.
మధ్యాహ్నం మూడున్నర గంటలకు పోలింగ్ ముగియనుండగా...4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఎక్కడికక్కడ ఉపసర్పంచి ఎన్నికను పూర్తిచేస్తామని అధికారులు వెల్లడించారు.
ఇదీచదవండి