రఫేల్ యుద్ధ విమానాన్ని త్వరలో ఓ అమ్మాయి నడపబోతోందని రక్షణశాఖ మూడురోజుల కిందట ప్రకటించినప్పటి నుంచే ఓ ఉత్సుకత మొదలైంది. ఆమెకు మిగ్-21 యుద్ధ విమానం నడిపిన అనుభవమూ ఉందని చెప్పడంతో... ఆ వీర వనిత ఎవరై ఉంటారనే ఆసక్తితో దేశమంతా ఎదురుచూసింది. ఆ ఊహాగానాలకు తెరదించుతూ... తాజాగా ఆ సివంగి పేరు ‘శివాంగీ సింగ్’ అని ప్రకటించింది రక్షణశాఖ.
ఇంతకీ ఎవరీ శివాంగి? వారణాసికి చెందిన శివాంగి 2016లో ఐఏఎఫ్‌కి ఎంపికైంది. 2017లో ఏర్పాటైన రెండో మహిళా ఫైటర్ పైలట్ల బృందంలో సభ్యురాలీమె. హైదరాబాద్‌లో శిక్షణ పూర్తయ్యాక.. రాజస్థాన్ సరిహద్దులోని వైమానిక స్థావరంలో విధుల్లో చేరింది. ఇక్కడే వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వద్ద శిక్షణ పొందే అవకాశం దొరికింది. మిగ్-21 కఠినమైన ఫైటర్ జెట్. దీన్ని అత్యంత ఎత్తు నుంచి కిందకి దింపేటప్పుడు, టేకాఫ్ చేసేటప్పుడు గంటకు 340 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. శివాంగి దీన్ని నడపడంలో అసాధారణ ప్రతిభాపాటవాలని ప్రదర్శించి రఫేల్ నడిపే అర్హత సాధించింది.
ప్రస్తుతం అంబాలా ఎయిర్‌బేస్‌లోని గోల్డెన్ ఆరో స్క్వాడ్రన్ బృందంలో చేరి శిక్షణ తీసుకుంటోంది. రఫేల్‌ని నడపడమంటే మాటలు కాదు. ఈ బహుళ ప్రయోజన యుద్ధవిమానంలోని పైలట్ ధరించే హెల్మెట్ మొదలు, శత్రువు ఎంత దూరంలో ఉన్నాడో కనిపెట్టి దాడులు చేయగలిగే పరికరాలన్నీ ప్రత్యేకమే. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ శత్రువు జాడ దొరగ్గానే... బాంబుల వర్షం కురిపించడానికి సిద్ధమైపోవాలి. ‘రఫేల్ నడిపేందుకు అత్యంత కఠోర శిక్షణ తీసుకుంటున్నా. ఇదో గొప్ప అవకాశం. దేశం గర్వపడేలా చేస్తా’ అంటోంది శివాంగి.