పరీక్షా కాలం మెుదలైంది. పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం ఆసన్నమైంది. చదివేయాలంతా అని విద్యార్థులు నిర్ణయించుకుంటారు. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం అస్సలు సహకరించవు. తలుపులు వేసుకున్నా.. ఏదో గుయ్.. గుయ్ అని బయటి నుంచి శబ్దం. ఇది తప్పించుకునేందుకు చాలామంది సంగీతాన్ని ఆశ్రయిస్తారు. మరి సంగీతం వింటే.. ఏకాగ్రత పెరుగుతుందా? ఒకవేళ సంగీతం వినే అలావాటు ఉంటే ఎలాంటి సంగీతం వింటే.. మంచిది.
సంగీతమంటే ఇష్టం కదా అని పరీక్షా కాలంలో డీజే పాటలు విన్నారంటే.. అంతే సంగతులు. ఇంట్లో ఎగిరి గంతేస్తారు... కానీ పరీక్షలో మాత్రం బోల్తా కొడతారు. బయటి నుంచి వచ్చే శబ్దాల నుంచి బయటపడి.. ఏకాగ్రత పెంచుకోవాలంటే.. తక్కువ శబ్దంతో సంగీతం వింటే.. మంచిది అంటున్నారు నిపుణులు.
చదివేప్పుడు ఎలాంటి సంగీతం వినాలి?
మీరు చదివేప్పుడు సంగీతం వింటే... ఏకాగ్రత ఉంటుందో లేదో ముందుగానే గుర్తించాలి. చాలామందికి వాయిద్య సంగీతం వింటే ఏకాగ్రత పెరుగుతుంది. రెండు వేర్వేరు పనుల మధ్య మీ ఏకాగ్రత స్థిరంగా ఉంటుందో లేదో.. ఒక్కసారి గమనించండి. మ్యూజిక్ మీకు ఏకాగ్రత కలిగిస్తుందనుకుంటే.. కింద ఇచ్చిన వాటిని పాటించే ప్రయత్నం చేయండి.
శాస్త్రీయ సంగీతం
ప్రశాంతంగా ఉండాలంటే శాస్త్రీయ సంగీతం ఎంతో మేలు. ఇది వింటుంటే.. ఏకాగ్రత ఎక్కడికి పోదు. చుట్టూ నిర్మలమైన వాతావరణాన్ని సృష్టించడానికి శాస్త్రీయ సంగీతం ఉపయోగపడుతుంది.
వాయిద్య శబ్దాలు
ఈ కాలం నాటి వారికి కూడా ఇష్టమైన సంగీతం వాయిద్యం. ఇప్పుడు చాలా సినిమాల్లో నేపథ్య సంగీతం కోసం వాయిద్యాలు ఉపయోగిస్తున్నారు. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం కలిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఏకాగ్రత పెంచుకునేందుకు వాయిద్య సంగీతం సరైన మార్గం.
ప్రకృతి ధ్వనులు
శాస్త్రీయ సంగీతం అంటే నచ్చని వారికి ప్రకృతి నుంచి వచ్చే ధ్వనులతో ఏకాగ్రత పెరుగుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ప్రకృతి ధ్వనులు ఉపయోగకరం. జలపాతం జాలువారే చప్పుళ్లు, పక్షులు కిలకిలారావాలు, సముద్రపు అలల చప్పుడు వంటివి.. మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. ధ్యానం చేసే సమయంలోనూ ఇలాంటి శబ్దాలు ఉండేలా చూసుకుంటారు. ప్రకృతి ధ్వనుల మధ్య ఏకాగ్రతగా చదువుకుందాం అనుకునేవారికి ఇది ఎంతో ఉపయోగం. అయితే ఇలాంటి శబ్దాలు వింటుంటే నిద్ర ఇట్టే వచ్చేస్తుంది. జాగ్రత్త మరి..!