నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ కోసమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన వివరణకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రిప్లైకౌంటర్ వేశారు. తనను ఎస్ఈసీ పదవీ నుంచి తప్పించాలన్న దురుద్దేశంతోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలకు మాత్రమే రాజ్యాంగంలోని 243- కె అధికరణం రక్షణ కల్పిస్తుందిగానీ పదవీ కాలానికి కాదని ప్రభుత్వం చెప్పడం రాజ్యాంగ విరుద్ధమేనన్నారు. ఎస్ఈసీ పదవీకాలానికి సైతం రాజ్యాంగ రక్షణ ఉందన్నారు. సర్వీసు నిబంధనలు అంటే పదవీకాలం కలుపుకునేనని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసిందని రమేశ్‌కుమార్ పేర్కొన్నారు.
అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి సహేతుకమైన కారణాలను ప్రభుత్వం చెప్పలేకపోయిందని నిమ్మగడ్డ రేమేశ్ కౌంటర్ అఫడవిట్‌లో ఆక్షేపించారు. ఎస్ఈసీ పదవీకాలం కుదింపునకు ముందు ఎలాంటి అధ్యయనం జరగలేదని, ఎలాంటి సిఫార్సులు కూడా..లేవన్నారు. కొన్నేళ్లుగా ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారి ఎస్ఈసీగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం నిరాధారమన్నారు. రాష్ట్ర ఎన్నికలసంఘం బలోపేతమయ్యేలా సూచనలు చేసేందుకు ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ 2011 అక్టోబర్ 14న నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఎస్ఈసీ పదవీకాలం ఐదు లేక ఆరేళ్లు కొనసాగవచ్చని చేసిన సిఫార్సును కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని నిమ్మగడ్డ కోర్టుకు తెలిపారు. దీనికి విరుద్ధంగా రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారని వివరించారు.
కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో తనకు ప్రాణహాని ఉందని చెప్పడం కేవలం ఓ ఆరోపణగా ప్రభుత్వం చూపడం సరికాదని నిమ్మగడ్డ తప్పుపట్టారు. సీఎం మొదలుకుని..మంత్రులు, సభాపతి, ఇతర నేతలు బహిరంగంగా దూషించాకే.. తనకు బెదిరింపులు వచ్చాయన్నారు. తన హయాంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని బాహాటంగానే ఆరోపించిన సీఎం, సీఎస్... తనను ప్రత్యక్షంగా తొలగించలేక...ఆర్డినెన్స్ తీసుకొచ్చారన్నారు.
పదవీకాలం కుదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనుకున్నా ఇప్పటికే విధులు నిర్విర్తిస్తున్న తనకు దాన్ని వర్తింపజేయడానికి వీల్లేదని రమేష్‌కుమార్ కోర్టుకు తెలిపారు. షరతులతో కూడిన శాసన అధికారాలకే గవర్నర్ పరిమితం కావాలని...వాటిని అతిక్రమించడానికి వీల్లేదన్నారు. ఆర్డినెన్స్...ఎన్నికల సంఘం స్వతంత్రతను దెబ్బతీసేదిలా..రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ పరిణామాలన్నింటినీ.. దృష్టిలో ఉంచుకుని ఆర్డినెన్స్, తదనంతర జీవోలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాల్సిందిగా రమేశ్‌కుమార్ కోర్టును కోరారు. ఎస్ఈసీ విషయంలో దాఖలైన మెుత్తం 12 వ్యాజ్యాలపై నేడు విచారణ జరగనుంది.
ఇదీ చూడండి దురుద్దేశంతోనే తొలగించారు': హైకోర్టులో నిమ్మగడ్డ రిప్లై కౌంటర్