కనీస సమాచారం లేకుండా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం అమానుషమని.... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆయన అరెస్ట్ జగన్ కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. బలహీనవర్గాలను అణగదొక్కే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
'వైకాపా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నందుకే.. మాజీమంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. ఈ చర్యలతో బలహీనవర్గాల మీద ప్రభుత్వ వైఖరేంటో అందరికీ అర్థమవుతోంది. ' ---- కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి
ఈఎస్ఐ అనేది కేంద్రప్రభుత్వం అధీనంలో ఉంటుందని.. దాన్ని నడిపించడం ఒక్కటే రాష్ట్రప్రభుత్వం బాధ్యతని కొల్లు రవీంద్ర అన్నారు. అందులో అక్రమాలు జరిగితే డైరెక్టర్లను ప్రశ్నించాలి కానీ.. మంత్రికి ఏం సంబంధం అని నిలదీశారు.
'తెలంగాణలోనూ ఈఎస్ఐ అక్రమాలపై విచారణ జరుగుతోంది. అందులో డైరెక్టర్లను అరెస్ట్ చేస్తున్నారు కానీ.. మంత్రులను కాదు. మన రాష్ట్రంలో కనీస సమాచారం లేకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా మంత్రిని అరెస్ట్ చేశారు. ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న మనిషిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు ఇది నిదర్శనం' --- కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి
దశాబ్దాలుగా అచ్చెన్నాయుడు కుటుంబం నిజాయతీగా రాజకీయాలు చేస్తోందని.. అలాంటి వారిపై అవినీతి మరక అంటించేందుకు ప్రయత్నిస్తున్నారని రవీంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై తామంతా న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి... 'అచ్చెన్న అరెస్టు అవినీతికి పాల్పడినందుకా.. కక్ష సాధింపు కోసమా..?'