సీఎం జగన్, విజయసాయి రెడ్డిలు రాజధాని మాటున విశాఖను దోచేస్తున్నారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. వేల కోట్ల విలువైన చారిత్రాత్మక భవనాలపై వైకాపా దొంగల కన్ను పడిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి రూ.1600 కోట్లు దోచే కుట్ర పన్నారని ఆరోపించారు. విశాఖ కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు వికలాంగుల హాస్టల్‌ను తనఖా పెట్టే యత్నం చేశారని అన్నారు.
విజయసాయిరెడ్డికి ధన దాహం తీరడం లేదని.. డబ్బు లేకపోతే సాక్షి మీడియా ఆస్తులు, విలాసవంతమైన భవనాలను తాకట్టు పెట్టుకోవాలని అన్నారు. అధికారం ఉందని విర్రవీగితే రానున్న రోజుల్లో ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు. పేదలకు నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో ఇళ్ల పట్టాలిచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఆ డబ్బును దేనికి ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల సొమ్మును వైకాపా నేతలు దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలు గుడిసెల్లో ఉండకూడదనే ముందుచూపుతో.. తెదేపా ప్రభుత్వం నిర్మించిన 20 లక్షలకు పైగా ఇళ్లను దురుద్దేశంతో నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుపెట్టారు మండిపడ్డారు.
ఇవీ చదవండి: