Senior advocate Jada Shravan Kumar: మృతదేహం తీసుకొచ్చి నేరుగా ఇంటి వద్ద పడేశారని... మృతదేహం ఎలా అప్పగించారో పోలీసులకు బాధిత కుటుంబం తెలిపిందని సీనియర్ న్యాయవాది శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. రిపోర్టులోని అంశాలు పరిగణించకుండా ఎమ్మెల్సీ పేరు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతిగా ఎలా కేసు నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఎస్పీ స్టేట్‌మెంట్‌ను రాష్ట్ర ప్రజలంతా విన్నారన్న ఆయన.. చనిపోయిన తర్వాత మృతుణ్ని కొట్టారని ఎలా చెబుతారని నిలదీశారు. ఏడు నుంచి 8 మంది హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు.
సుబ్రహ్మణ్యాన్ని అమానవీయంగా కొట్టి చంపారని మండిపడ్డారు. తాను ఒక్కణ్నే నిందితుడిని అని ఎమ్మెల్సీ చెప్పారని.. సహ నిందితులను కాపాడేందుకే ఎమ్మెల్సీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఒక్కడే చంపి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారంటే నమ్మాలా? అని దుయ్యబట్టారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. తోస్తే చనిపోయారనడం అవాస్తవమని దారుణంగా కొట్టి చంపారని ఆరోపించారు. హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో పిటిషన్ వేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌పై నమ్మకం లేకనే జాతీయ కమిషన్‌కు వెళ్తున్నామన్నారు.
ఎట్టి పరిస్థితిలో ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాల్సిందేనన్నారు. హత్య చేసిన వ్యక్తిని ఇంకా పార్టీలో ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీని పదవి నుంచి తొలగించినట్లు ఇంతవరకు అధికారిక ప్రకటన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపి ఇంటి వద్ద మృతదేహం పడేసి పెళ్లిళ్లు, విహార యాత్రలకు ఎమ్మెల్సీ వెళ్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. హత్య చేసినవాడిని అరెస్టు చేయడం పోలీసుల బాధ్యత కాదా? అని అడిగారు. ఎంతమంది దాడిలో పాల్గొన్నారో వాస్తవాలు బయటకురావాలని అన్నారు.
ఇవీ చదవండి: