state government debt calculations: రాష్ట్ర ప్రభుత్వ అప్పుల లెక్కల్లో తప్పులు కనిపిస్తున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రుణాలు తీసుకుని, అవి ప్రభుత్వ అప్పులు కావని వాదిస్తోంది. ఆ వాదనలో పసలేదని కేంద్రం తేల్చేసింది. దొడ్డిదోవన తీసుకుంటున్నవీ ప్రభుత్వ అప్పులేనని చెప్పింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులన్నీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయనీ రిజర్వుబ్యాంకు తేల్చేసింది. ఇలా ప్రభుత్వ బడ్జెట్ నుంచి రాష్ట్రం తీరుస్తున్న గ్యారంటీ అప్పుల లెక్కల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పుస్తకాల్లో చూపిస్తున్న లెక్కలకు, కేంద్రానికి నివేదించిన లెక్కలకు పొంతనలేదు. రాష్ట్రం కేంద్రానికి నివేదించిన లెక్కల్లో తేడాలున్నాయని స్పష్టంగా తేలిపోతోంది. చట్టసవరణ చేసి మరీ డిబెంచర్లు వేలం వేసి తెచ్చుకున్న రుణాలను ఆ లెక్కల్లో చేర్చకపోవడమూ చర్చనీయాంశమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇస్తూ తన బడ్జెట్ నుంచి తిరిగి చెల్లిస్తున్న రుణాల సంఖ్యను కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి రాజ్యసభలో వెల్లడించారు. అవి కేంద్రం పరిశీలించి వెల్లడించిన లెక్కలు కాదని, రాష్ట్రప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఈ వివరాలు వెల్లడిస్తున్నట్లు కూడా తేల్చేశారు. ఆ లెక్కల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.22,549.50 కోట్లు, 2021-22లో రూ.6,287.74 కోట్లు ఇలా రుణాలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2022-23లో రూ.500 కోట్లు ఇలా తీసుకోవాలన్న అంచనాలున్నాయని ఆంధ్రప్రదేశ్ తెలియజేసినట్లు పేర్కొంది. ఈ అప్పులు కార్పొరేషన్ తీసుకున్నా వాటి అసలు, వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించడమో, లేక సెస్ లేదా ఇతర పన్నుల ఆదాయం వాటికి మళ్లించడమో చేస్తున్నట్లు పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకునేందుకు కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ అందించిన సమాచారంలో ఈ విషయం ఉన్నట్లు కూడా కేంద్రం వెల్లడించింది.
రాష్ట్ర గణాంకాల్లోనే..
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుచేసుకుని అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ఆ సంస్థకు మళ్లించి రుణాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ఇలా రూ.25వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి ప్రధానికి ఈ జనవరిలో రాసిన లేఖ ప్రకారం 2020-21లో ఏపీఎస్‌డీసీ నమూనాలో రుణాలు తీసుకున్నామని చెప్పారు. ఇంకా ఇందులో రూ.1,800 కోట్ల రుణం కేంద్రం అభ్యంతరాల వల్ల పెండింగులో ఉందన్నారు. కేంద్రం తాజాగా వెల్లడించిన లెక్కల్లో ఈ మొత్తం ఎక్కడ వెల్లడించారనేది స్పష్టత లేదు.
- కేంద్రం వెల్లడించిన లెక్కల్లో 2021-22లో ఇలాంటి రుణం రూ.6,284.74 కోట్లే పొందినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పుస్తకాల్లో చూస్తే ఈ లెక్కతో పొంతన లేదు. 2022-23 బడ్జెట్ ప్రసంగంలో చూస్తే 2021-22లో ఏపీఎస్‌డీసీ ద్వారా వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలకు రూ.10,638.11 కోట్లు వెచ్చించినట్లు చూపారు. ఏపీఎస్‌డీసీ రుణం అదనపు ఎక్సైజ్ సుంకం ద్వారా తీసుకున్నదే. కేంద్రం చెప్పిన మొత్తానికి, రాష్ట్రం చెబుతున్న మొత్తానికి ఎలా తేడా వచ్చిందనేది ప్రశ్నార్థకమవుతోంది.
- 2020-21లో రూ.16,899 కోట్లు ఏపీఎస్‌డీసీ ద్వారా తీసుకున్న రుణంతో కొన్ని కార్యక్రమాలు అమలుచేసినట్లు బడ్జెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రూ.2వేల కోట్ల రుణం తీసుకున్నారు. పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూపాయి సెస్ విధించి ఆ మొత్తాన్ని కార్పొరేషన్‌కు మళ్లించి.. ఇది చెల్లింపు మార్గంగా పేర్కొన్నారు. ఆ మొత్తం కూడా కేంద్రం పేర్కొన్న రుణాల్లో కలిపిన దాఖలాల్లేవు.
- ఏపీ బెవరేజస్ కార్పొరేషన్‌కు నేరుగా స్పెషల్ మార్జిన్ వసూలు చేసుకునే అధికారాన్ని రాష్ట్రప్రభుత్వం కల్పించింది. మద్యంపై రాష్ట్రం వసూలుచేసే వ్యాట్ 35% నుంచి 60% వరకు తగ్గించి బెవరేజస్ కార్పొరేషన్ ఆ మేరకు ప్రత్యేక మార్జిన్ వసూలు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆ ఆదాయం ఆధారంగా చూపి బాండ్లు వేలం వేసి రూ.8,300 కోట్ల రుణం తీసుకున్నారు. మరో రూ.25వేల కోట్ల రుణానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులోనూ రాష్ట్ర రాబడిని పరోక్షంగా కార్పొరేషన్‌కు మళ్లించిన విషయం విశదమవుతోంది.
- మరోవైపు స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌కు అనేక నిధులు మళ్లించారు. ఆ డిపాజిట్లపై తాము వడ్డీ చెల్లిస్తామని కార్పొరేషన్ పేర్కొంది. ఈ ప్రభావమూ రాష్ట్ర ఖజానాపై పడుతుంది. ఈ లెక్కలూ కేంద్రం వెల్లడించిన గణాంకాల్లో లేవు.
ఇప్పటికే కేంద్రం కన్నెర్ర: రాష్ట్రాల్లోని ఐఏఎస్ అధికారులు తప్పుడు లెక్కలు పంపుతున్నారంటూ గతంలోనే కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటివారిపై చర్యలు తీసుకుంటామని, వారి రికార్డుల్లోనూ నమోదు చేస్తామని సీఎస్‌లకు లేఖలు రాసింది. ఆర్థిక అంశాల్లో ఐఏఎస్‌లు తప్పుడు సమాచారం పంపుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక లెక్కల్లో మతలబు ఉండటం విశేషం.
మూడోపక్షం పరిశీలనే కీలకం: పోలవరం ప్రాజెక్టు పురోగతి.. సకాలంలో నిర్మాణం పూర్తిచేసేందుకు హైదరాబాద్ ఐఐటీ నిపుణులతో పోలవరం అథారిటీ అధ్యయనం చేయించి నివేదిక రూపొందించింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలపైనా, అప్పులపైనా మూడోపక్షం అధ్యయనం, పరిశీలన అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్‌లో చూపకుండా చేస్తున్న రుణాల వివరాలు కావాలని కాగ్ ఎప్పటికప్పుడు అడుగుతున్నా రాష్ట్రం ఇవ్వట్లేదు. తాజాగా ఏప్రిల్ నెల కాగ్ నివేదికలోనూ అదే విషయం పేర్కొంది.
ఇవీ చూడండి