Ramachandra Mohan suspension order revoked: దేవాదాయశాఖ అదనపు కమిషనర్-2 (ఏడీసీ) కె.రామచంద్ర మోహన్‌పై సస్పెన్షన్‌ను ఎత్తి వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ తొలగించడంతో పాటు విచారణ పూర్తయ్యేదాకా ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దంటూ హైకోర్టు జనవరి 6న మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. తదనుగుణంగా ప్రభుత్వం తాజా ఆదేశాలిచ్చింది. ఆయన మంగళవారం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ను కలిసి రిపోర్ట్ చేశారు. పోస్టింగ్ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. రామచంద్ర మోహన్ గతంలో సింహాచలం ఆలయ ఈవోగా, మాన్సాస్ ట్రస్ట్ ఇన్‌ఛార్జి ఈవోగా ఉన్నప్పుడు.. సింహాచలం భూములను ఆలయ రిజిస్టర్ నుంచి తొలగించారని, మాన్సాస్ భూముల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు తెరపైకి తెచ్చారు. దీనిపై గతేడాది జులై 5న విశాఖ ఉప కమిషనర్ పుష్పవర్ధన్‌ను విచారణకు నియమించారు.
అదనపు కమిషనర్ స్థాయి అధికారిపై, కిందిస్థాయిలో ఉండే ఉప కమిషనర్‌ను విచారణకు నియమించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో జులై 7న అదనపు కమిషనర్-1 చంద్రకుమార్‌ను ఆ కమిటీలో చేర్చారు. జులై 10న దుర్గగుడి ఈవో భ్రమరాంబను కూడా కమిటీలో చేరుస్తూ ఆదేశాలిచ్చారు. ఈ కమిటీ జులై 13న సింహాచలం, 14న మాన్సాస్‌లో రికార్డులు పరిశీలించి, జులై 16న కమిషనర్‌కు ప్రాథమిక నివేదిక అందజేసింది. దీని ఆధారంగా రామచంద్రమోహన్‌ను సస్పెండ్ చేస్తూ ఆగస్టు 6న ఆదేశాలు జారీచేశారు. క్రిమినల్ కేసు నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. వీటిపై విజిలెన్స్ విచారణను మూడు నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంటూ ఆగస్టు 8న ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. మరోవైపు తన సస్పెన్షన్ సరికాదని రామచంద్రమోహన్ హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. విచిత్రంగా.. ముగ్గురు అధికారుల కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదికను ఇప్పటికీ ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించలేదు.
ఇదీ చదవండి: