Employees JAC News: విజయవాడ గాంధీనగర్‌లోని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అధికారులతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం లేదని.. ఇకపై నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి డిమాండ్లు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలో ఎలాంటి పురోగతి లేదన్నారు. ఈనెల 3వరకు సమస్యల పరిష్కారానికి గతంలో గడువిచ్చిన ఉద్యోగులు.. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన దృష్ట్యా మరో వారం రోజులు వేచి చూడనున్నారు. ఈనెల 9లోగా సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎక్కడ పోరాటం ఆగిందో అక్కడినుంచే తిరిగి ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఉద్యమాన్ని విరమించాలని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఆ తర్వాత ముఖం చాటేశారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. తాము 71 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచితే ఇప్పటి వరకు ఒక్క హామీ నేరెవేర్చలేదన్నారు. సీపీఎస్ ఉద్యోగుల వేలకోట్లు రూపాయలు ఎక్కడికి పోయాయో లెక్కచెప్పడం లేదన్నారు. పీఆర్సీ డిమాండ్ నెరవేర్చడం వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని ఐకాస నేతలు తెలిపారు. అయితే ఇకపై అధికారుల స్థాయి చర్చలకు హాజరుకాకూడదని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు.
ఇదీ చదవండి..