New Zonal System in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ విధానాన్ని అనుసరించి మొదలైన ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. నేటితో జిల్లా స్థాయి కేటాయింపులు పూర్తికానున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఉద్యోగులకు సొంత జిల్లాల్లో కొత్త స్థానాల్లో పోస్టింగులు రానున్నాయి. మరోవైపు జోనల్, బహుళ జోనల్ బదలాయింపులు దాదాపు సగం పూర్తయ్యాయి. మొత్తం 34 శాఖలకు 18 శాఖల్లో కేటాయింపులు జరిగాయి. మిగిలిన శాఖలకు మరో మూడు రోజుల సమయం తీసుకోనున్నారు.
జిల్లాస్థాయుల్లో 56 వేల మంది బదలాయింపులు!
Employees Allocation: ప్రభుత్వం నిర్దేశించిన మేరకు జోనల్ విధానంలో బదలాయింపులు జరుగుతున్నాయి. జిల్లాస్థాయిలో ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించి, ఐచ్ఛికాల ఆధారంగా వారి సొంత జిల్లాలకు కేటాయింపులు జరిగాయి. వీటన్నింటిని ఆర్థికశాఖలోని ప్రత్యేక పోర్టల్ ఐఎఫ్‌ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్)లో నమోదు చేశారు. దీని ఆధారంగా బదలాయింపులను నిర్దేశిస్తూ ఉద్యోగులకు ఉత్తర్వులు జారీఅవుతాయి. ఆయా ఉద్యోగులు తమ జిల్లా కలెక్టర్లు, శాఖల ఉన్నతాధికారుల వద్ద రిపోర్ట్ చేయాలి. దాని ఆధారంగా రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తారు. జిల్లాస్థాయుల్లో 56 వేల మంది వరకు ఉద్యోగులకు బదలాయింపులు జరగనున్నాయని తెలుస్తోంది.
జోనల్, బహుళ జోన్లలో..
జోనల్, బహుళ జోన్లలోనూ ఉద్యోగులు, అధికారుల సీనియారిటీ జాబితా రూపొందించారు. బదలాయింపులు కోరుతున్న వారి నుంచి ఐచ్ఛికాలు తీసుకున్నారు. వాటి ఆధారంగా వారిని సొంత జోన్లు, బహుళ జోన్లకు పంపించేందుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్రస్థాయి కేటాయింపుల కమిటీ సమావేశాలు రెండు రోజులుగా సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ అధ్యక్షతన జరుగుతున్నాయి. ఆర్థికశాఖ సలహాదారు శివశంకర్, శాఖల అధిపతులు, టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీజీవోల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ తదితర ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు పురపాలక, పంచాయతీరాజ్, పశుసంవర్ధక, స్త్రీ శిశు సంక్షేమ, నీటిపారుదల, వాణిజ్య పన్నులు, ఆర్థిక, రవాణా, ప్రణాళిక, సర్వే, హోం, అగ్నిమాపక, అటవీ, ఆయుష్ తదితర శాఖల్లో కేటాయింపులు పూర్తయ్యాయి.
ఈ జాబితాను సైతం ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో మిగిలిన శాఖల్లోనూ కేటాయింపులు పూర్తవుతాయి. ఆ తర్వాత బదలాయింపుల ఉత్తర్వులు ఇస్తారు. జోనల్ స్థాయిలో ఉత్తర్వులు పొందిన వారు తమ శాఖాధిపతుల వద్ద రిపోర్టు చేయాలి. బహుళజోనల్ ఉత్తర్వులు పొందిన వారు ఆయా శాఖల ముఖ్యకార్యదర్శుల వద్ద రిపోర్టు చేయాలి. వారందరికి కొత్త పోస్టులపై ఉత్తర్వులు జారీ అయ్యాక.. వారు వారం రోజుల్లో తమకు కేటాయించిన స్థానాల్లో చేరాలి. సీఎం నిర్దేశించిన విధంగా మరో 4 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని ఆ రాష్ట్ర సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన బీఆర్‌కే భవన్‌లో ముఖ్యకార్యదర్శులతో సమావేశమయ్యారు. జోనల్, బహుళజోనల్ అధికారుల్లో కొందరు తమకు బదలాయింపుల ఉత్తర్వుల అనంతరం విధుల్లో చేరేందుకు జూన్ వరకు గడువు పొడిగించాలని ఆదివారం సీఎస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్నందున జూన్ వరకు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలని కోరారు.