కృష్ణా నది చెంతనే ఉన్నా విజయవాడలోని పలు ప్రాంతాలకు తాగునీటి కష్టాలు తప్పటం లేదు. వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని అధికారులు చెప్తున్నా.. అనేక ప్రాంతాల్లో సకాలంలో నీటి సరఫరా జరగటంలేదు. ఇప్పుడే నీటి కోసం పాట్లు పడుతున్నామని రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేసవి ఆరంభంలోనే.. నీటి కష్టాలు
వేసవి ఆరంభంలోనే విజయవాడ నగరంలో నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. అత్యధిక ప్రాంతాల్లో తాగునీటికి తిప్పలు తప్పడంలేదు. ప్రధానంగా శివారు, కొండ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రక్షితనీరు సరఫరా కావడం లేదు. నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు వేసవిలో నిరంతరాయంగా తాగునీటిని అందించేందుకు 3.72 కోట్ల రూపాయలు కేటాయించారు.
అవసరాలు తీర్చేందుకు ప్రణాళికతో ముందుకు:
కేటాయించిన నిధులతో అధికారులు వేసవి ప్రణాళికను సిద్ధం చేశారు. ఫలితంగా పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేయడం, అవసరమైన ప్రాంతాల్లో బోర్లు అమర్చడం, పాడైపోయిన బోర్లకు మరమ్మతులు చేయడం, తుప్పుపట్టిన పైపులను మార్చడం, శివారు ప్రాంతాలకు అదనపు నీటి ట్యాంకర్ల ద్వారా రక్షితనీటిని అందించడం.. వంటి చర్యలకు నగరపాలక ఏర్పాట్లు చేస్తోంది. కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మరోలా ఉన్నాయి.. కుళాయిల్లో నీరు పది నిమిషాలకు మించి రావడం లేదని ప్రజలు వాపోతున్నారు.
నగరంలోని అనేక ప్రాంతాల్లో పాడైపోయిన, తుప్పుపట్టిన పైపులు, కుళాయిలను గుర్తించి యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేయాలని.... కుళాయిలు ద్వారా నీటి సరఫరాను మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు. అప్పుడే వేసవి కష్టాల నుంచి బయటపడగలమని అంటున్నారు.
ఇదీ చదవండి: సర్పంచ్ల హక్కులు కాలరాసే విధంగా ప్రభుత్వ జీవో: లోకేశ్