కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. 10 సంవత్సరాల క్రితం మంజూరైన స్థలాలకే మళ్లీ పట్టాలు పంపిణీ చేస్తున్నారని బాధితుల ఆందోళనకు దిగారు.
అవకతవకలను అరికట్టాలి
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, అవకతవకలను అరికట్టాలని కోరుతూ.. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో తేదేపా నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని.. . తెదేపా నేత పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆరోపించారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపులో అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు.
ఉండిలో ఎన్నికల ప్రచారంలా మారిన పంపిణీ కార్యక్రమం
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం కాళింగగూడెం గ్రామంలో.. ఇళ్ల పట్టాల పంపిణీ ఎన్నికల ప్రచారంగా మారింది. సంక్షేమ పథకాల పేర్లు చెబుతూ.. మండల స్థాయి నాయకులు.. స్థానిక ఎంపీటీసీ అభ్యర్థికి ఫ్యాను గుర్తుకి ఓటు వేసి గెలిపించమని చెప్పడంతో.. తెదేపా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు దీన్ని ఖండించారు. ఇది పార్టీకి సంబంధించిన వేదిక కాదని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలిపారు. ఇప్పుడు దేవాలయాలపై దాడి జరగడాన్ని తెదేపా రాజకీయం చేస్తోందన్న వ్యాఖ్యలను సైతం ఆయన ఖండించారు.
శిలాఫలకం ధ్వంసం
గుంటూరు జిల్లా బాపట్లలోని వెదుళ్లపల్లి కొత్తపాలెం గ్రామంలో.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైకాపా కార్యకర్తల మధ్య వర్గపోరు జరిగింది. నాయకులు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారుంటూ మరో వర్గం వారు ఆరోపణలు చేశారు. గ్రామంలో వైకాపాకు చెందిన రెండు వర్గాలుండగా.. ఓ వర్గం వారు ఇళ్ల పట్టాల పంపిణీ శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వేరే ప్రాంతాల్లో ఉంటున్నారని.. పట్టాలు ఇవ్వలేదు
అనంతపురం జిల్లా గాండ్లపెంటోలని చెరువు ముందర తండాలో ఇల్లులేని 20 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ పట్టాలు పంపిణీ చేస్తామంటూ సచివాలయ సిబ్బంది టోకెన్లను అందించారు. అయితే తహసీల్దార్ వెంకటరమణ ఇతర సిబ్బంది కలిసి చెరువు ముందర తండాలో పట్టాల పంపిణీ ప్రారంభించారు. గ్రామంలో తొమ్మిది మందికి మాత్రమే పట్టాలను అందజేసి.. మిగతా 11 మందికి పట్టాలు ఇవ్వలేదు. స్థానిక అధికారులు సర్వే ప్రకారం 11 మంది గ్రామంలో లేరని తేలటంతో.. వారికి పట్టాలు ఇవ్వలేదని తెలిపారు.
ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు, ఓటర్ కార్డు తదితర గుర్తింపు కార్డులన్ని చెరువు ముందర తండాలోనే ఉన్నాయని లబ్ధిదారులు తెలిపారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తమకు పట్టాలు ఇవ్వకపోవడం సరికాదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే మరోసారి వివరాలు సేకరిస్తామని లబ్ధిదారులు అందుబాటులో ఉండి వారు ప్రస్తుతం ఉంటున్న ఇళ్లను చూపాలని తహసీల్దార్ సూచించారు.
ఇదీ చదవండి: