మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ వ్యవహారంలో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. అశోక్ గజపతిరాజును ఛైర్మన్‌గా పునర్నియమిస్తూ..సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఆప్పీళ్లను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అశోక్‌గజపతి రాజు పునర్నియామకాన్ని సవాల్ చేస్తూ.. ప్రభుత్వంతో పాటు సంచైత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై..మధ్యంతర ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
వివాదం ఏంటంటే..
మాన్సాస్ వివాదం ఏంటంటే..మాహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్-మాన్సాస్ ట్రస్టును.. 1958లో పూసపాటి పీవీజీ రాజు స్థాపించారు. మాన్సాస్ ట్రస్ట్ కింద 108 ఆలయాలు, 14 వేల 800 ఎకరాల భూములున్నాయి. విద్యా సంస్థల నిరంతర మద్దతు కోసం ఆర్థిక సాయం అందించడానికి.. ట్రస్ట్ డీడ్ వారసత్వంగా 'ఎల్డెస్ట్ మేల్ లీనియల్ వారసుడు'గా.. నిర్వచించారు. దాని ప్రకారం 1994లో పీవీజీ రాజు మరణం తరువాత ఆయన పెద్ద కుమారుడు పూసపాటి ఆనంద్ గజపతి రాజు ట్రస్ట్ ఛైర్మన్ అయ్యారు.
2016లో ఆనంద్ గజపతి మరణం తరువాత.. పీవీజీ రాజు రెండో కుమారుడైన అశోక్ గజపతి రాజు పగ్గాలు అందుకున్నారు. గతేడాది మార్చిలో రాత్రికి రాత్రే అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా తప్పించిన ప్రభుత్వం.. ఆనంద గజపతి రాజు కుమార్తె సంచైత గజపతిరాజుకు పగ్గాలు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ జీవోను అశోక గజపతిరాజు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై హైకోర్టులో పోటాపోటీగా వాదనలు జరిగాయి. సంచైతను ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమించే అధికారం సర్కార్‌కు ఉందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. అశోక్‌గజపతిరాజు న్యాయవాదులు మాత్రం ప్రభుత్వ జీవో ట్రస్ట్ వీలునామా నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ట్రస్ట్ ఛైర్మన్‌గా పురుషుల అనువంశకత కొనసాగింపును మార్చాలంటే.. ట్రైబ్యునల్ ద్వారానే సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ అభీష్టం మేరకు మార్చడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
అశోక్‌గజపతిరాజు వాదనతో ఏకీభవించిన హైకోర్టు సంచైత నియామకంతోపాటు మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ఊర్మిళా గజపతిరాజు, ఆర్ వీ సునీత ప్రసాద్‌ను గుర్తిస్తూ ఇచ్చిన జీవోలనూ కొట్టేసింది. ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును పునరుద్ధరించాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి