ప్రచార, సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా దేవాలయాలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. గత 4నెలలుగా 58,871 దేవాలయాలను జియోట్యాగింగ్ చేశామని, 43,824 ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పటిష్ఠ భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు. జిల్లా ఎస్పీలతో మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ వీడియో సమావేశం ద్వారా మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది సెప్టెంబరు 5 నుంచి దేవాలయాలకు సంబంధించి 180 కేసులను ఛేదించి 337 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో దేవాలయాల కేసుల దర్యాప్తులో ప్రజల నుంచి ఇప్పటివరకు అందిన సహకారాన్ని ఎస్పీలు డీజీపీకి వివరించారు. ఆయా జిల్లాల్లో దేవాలయాల పరిరక్షణకు తీసుకున్న చర్యల్ని నివేదించారు.
పూజారి భార్యకు ప్రశంసలు
గుంటూరు జిల్లా కొత్తపేట ఠాణా పరిధిలోని కుసుమ హరనాథ దేవాలయంలో విగ్రహాల చోరీ ఘటనలో ఆలయ పూజారి భార్య హైమావతి చూపిన సాహసాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు. హైమావతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన రమణ, శ్రీరాములు, శ్రీనివాస్‌లు తమవంతు బాధ్యతగా పోలీసులకు సహకరించారని కొనియాడారు. వారిని అభినందించారు. కేసుల దర్యాప్తులో ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఇందుకు గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల కేసులే ఉదాహరణ అని వివరించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎస్పీలకు సూచించారు.
ఐదుగురికి అంత్రిక్ సురక్షా సేవా పతకాలు
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరచిన ఐదుగురు రాష్ట్ర పోలీసు అధికారులు కేంద్ర అంత్రిక్ సురక్షా సేవ పతకం-2020కు ఎంపికయ్యారు. డీఐజీలు పాలరాజు (సాంకేతిక), క్రాంతిరాణా టాటా (అనంతపురం రేంజి), రాజశేఖరబాబు (శాంతి భద్రతలు), ఎస్పీలు భాస్కర్ భూషణ్ (నెల్లూరు), విశాల్ గున్ని (గుంటూరు రూరల్) ఈ పతకాలను దక్కించుకున్నారు. పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ చేతుల మీదుగా ఈ పతకాలను అందుకున్నారు.
ఇదీ చదవండి: