ETV Bharat / city

ఏ-ఫారం.. బీ-ఫారం అంటే ఏంటి సార్? - ఆంధ్రా లోకల్ ఎలక్షన్ న్యూస్

ఎన్నికలొస్తే చాలు.. బీ ఫారం పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దానితోపాటు ఏ ఫారం పేరు కూడా. ఇంతకీ ఏ ఫారం, బీ ఫారం అంటే ఏమిటి? అవి ఎవరు ఇస్తారు? ఇదే అనుమానం వచ్చింది ఓ శిశ్యుడికి.. అదే విషయాన్ని తన గురువును అడిగాడు ఇలా..

Details of Form-B and Form-A
Details of Form-B and Form-A
author img

By

Published : Mar 12, 2020, 7:10 PM IST

శిశ్యుడు: ఇంతకూ బీ ఫారం అంటే ఏంటి సార్?

గురువు: అభ్యర్థులు తమ నామినేషన్ పత్రంలో తాము ఏదైనా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా? లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? అనే దానిని బీ ఫారంలో తెలియజేస్తారు. ఈ బీ ఫారాన్ని బట్టి ఒక అభ్యర్థి ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో తేలుతుంది.

శిశ్యుడు: అంటే అభ్యర్థులు తామూ ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో ఆ ఫారంలో చెప్తే సరిపోతుందా?

గురువు: కాదు మళ్లీ దీనికి రెండు ఫారాలు ఉంటాయి. ఒక దానిని ఫారం ఏ అంటారు. ఇందులో ఒక రాజకీయ పార్టీ తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు తెలియజేస్తుంది. ఈ ఫారం మీద ఆ రాజకీయ పార్టీ అధ్యక్షులు లేదా ప్రధాన కార్యదర్శి సంతకం చేయాలి. తమ పార్టీ ముద్ర కూడా వేయాలి.

శిశ్యుడు: ఇంతకీ బీ ఫారం ఎవరు ఇస్తారు?

గురువు: దీనిని అధికారికంగా ఫారం బి అంటారు. ఇందులో పార్టీ అధ్యక్షులో, ప్రధాన కార్యదర్శో తమ పార్టీ తరఫున ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరో తెలియజేస్తారు. దాని మీద వారు సంతకం చేసి ముద్ర వేయాలి. పార్టీ నాయకులు బీ ఫారం ఇస్తారు.

శిశ్యుడు: దీని వల్ల ఉపయోగం ఏమిటి?

గురువు: బీ ఫారం ఉంటే ఆ అభ్యర్థిని ఒక రాజకీయ పార్టీ తమ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నట్టు లెక్క. దాని వల్ల గుర్తింపు పొందిన పార్టీ అయితే.. ఆ పార్టీకి కేటాయించిన గుర్తు మీద పోటీ చేయోచ్చు. పార్టీ గుర్తు చదువు రాని వారికి గుర్తును బట్టి ఓటు వేయడానికి వీలవుతుంది. అలాగే ఎన్నికల ప్రచారంలో ఆ గుర్తు వాడుకోవచ్చు.

శిశ్యుడు: బీ ఫారం ఒకరికి ఇచ్చిన తర్వాత మరో అభ్యర్థికి కూడా ఇవ్వొచ్చా?

గురువు: అలా కుదరదు. కానీ సాధారణంగా రాజకీయ పార్టీలు అసలు అభ్యర్థితోపాటు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థితో కూడా నామినేషన్ వేయిస్తారు. ఇలాంటి వారిని డమ్మీ అభ్యర్థులంటారు. నిజానికి వీరిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. ఒకవేళ అసలు అభ్యర్థి నామినేషన్ పత్రం ఏ కారణం చేతనైనా తిరస్కరిస్తే.. ప్రత్యామ్నాయ అభ్యర్థి పేర బీ ఫారం ఇవ్వొచ్చు. అయితే ఒక పార్టీ తరఫున ప్రాదేశిక నియోజకవర్గంలో ఒకరి కన్నా ఎక్కువ మందికి బీ ఫారం ఇవ్వడం కుదరదు.

శిశ్యుడు: మరీ ఏ ఫారం ఎందుకు సార్?

గురువు: ఏదైనా గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులకు మాత్రమే ఎన్నికల సంఘం ఏ ఫారం అందజేస్తుంది. అది ఉన్నవారు మాత్రమే తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చే అధికారం కలిగి ఉంటారు. గుర్తింపు పొందిన పార్టీలు తమ పరిశీలకుడిగా నిర్ణయించి ప్రతిపాదించిన వ్యక్తికి ఎన్నికల సంఘం ఏ ఫారం ఇస్తుంది. ఆయనకు మాత్రమే తమ పార్టీ అభ్యర్థులకు ‘బీ ఫారం ఇచ్చే అవకాశం ఉంటుంది. పరిశీలకుడు తనకు లభించిన ఏ ఫారాన్ని ముందుగా ఆయా నియోజకవర్గాల్లోని అధికారులకు అందజేయాలి.

ఇదీ చదవండి: నువ్వలరేవు.. అంతా నవ్వుతూ.. ఒకే మాట ఒకే బాట!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.