Cyclone Asani: మచిలీపట్నం తీరానికి దగ్గరగా వచ్చిన వాయుగుండం బలహీనపడింది. కొన్నిగంటల్లో మరింత బలహీనపడి.. అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 'అసని' బలహీనపడినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
అంతకు ముందు : పలు మార్లు దిశ మార్చుకుంటూ తీరం వైపు ప్రయాణించింది అసని. దీంతో.. నరసాపురానికి దగ్గరలో తీరం దాటుతుందని ఓసారి, కోనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని మరోసారి ఇలా అంచనాలు వచ్చాయి. మొత్తానికి పలు మలుపులు తిరిగిన తుపాను.. చివరకు కృష్ణా జిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరం దాటింది
అధికారుల అప్రమత్తం : కోస్తా జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే మెరైన్ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన బీచ్‌లలో ప్రవేశాలను నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుపాను రక్షిత భవనాలనూ సిద్ధంగా ఉంచారు. కృత్తివెన్ను, నాగాయలంక, మచిలీపట్నం సహా చుట్టుపక్కల రక్షిత భవనాలను అందుబాటులోకి తెచ్చారు. నిజాంపట్నం హార్బర్‌లో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అసని తీవ్రతపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యల నిమిత్తం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ దళాలను సిద్ధం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వివరించారు.
వర్షాల ప్రభావంతో ధాన్యపు రాశుల్ని కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల ధాన్యం మొలకెత్తాయి. కోత కోయని వరి నేలకొరిగింది. చాలాచోట్ల జల్లులు.. ఆగి ఆగి కురుస్తుండటంతో రైతులు కోతకు వచ్చిన వరి గింజలు మొలకెత్తుతాయనే దిగులుతో ఉన్నారు. సీజన్లతో సంబంధం లేకుండా పంట నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు.
కుంగిన వంతెన: అసని తుపాన్ ప్రభావంతో కురస్తున్న వర్షాలకు అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేట మండలం వడ్డాది వద్ద పెద్దేరుపై ఉన్న వంతెన కుంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బీఎన్ రోడ్డులోని వంతెన శిథిలావస్థలో ఉండటంతో.. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వంతెన కుంగిపోయింది. అప్రమత్తమైన అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు.
ఇదీ చదవండి: