రాజ్యసభలో వైకాపాకు ఉన్న బలంతో ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైతు ప్రయోజనాలు సాధించే అవకాశం వచ్చినా.. భాజపాకు పూర్తిగా మద్దతు పలికి రాష్ట్ర ప్రయోజనాలను ధారాదత్తం చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వంపై పోరాడుతున్నట్లు నటిస్తూ.. కేంద్రంలో భాజపాతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుందని మండిపడ్డారు. వైకాపా అవకాశవాద రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.
లోక్సభలో కేంద్రానికి సంపూర్ణ బలం ఉంది. హోదా సాధ్యం కాదన్న ముఖ్యమంత్రి జగన్... మరి రాజ్యసభలో ఏం చేశారని మధు నిలదీశారు. మూడు రాజధానులపై వైకాపా ఏం చెప్పిందో భాజపా అదే చేస్తుందని పేర్కొన్నారు. భాజపా, వైకాపా మధ్య ఒప్పందం నిన్న రాజ్యసభ సాక్షిగా బయటపడిందని ఆరోపించారు.
పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న పవన్... భాజపా పంచన చేరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హోదా కోసం రాజీనామాలు చేసిన వైకాపా.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుందని నిలదీశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ 25న చేపట్టే నిరసనలకు సీపీఎం పూర్తిగా మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... శ్రీకాళహస్తి విగ్రహాల కేసును ఛేదించిన పోలీసులు...ముగ్గురు అరెస్ట్