CPI Ramakrishna on Electricity Charges hike: విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ఇప్పటికే కరోనా కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు.. ఓ పక్క ఇంటి పన్ను, మరోవైపు చెత్త పన్నుల పెంపుదలతో సతమతమవుతుంటే..ఇప్పుడు విద్యుత్ చార్జీలను భారీగా పెంచారని మండిపడ్డారు. కేటగిరీలను రద్దుచేసి, 13 స్లాబ్ లను 6 స్లాబ్ లకు కుదించి, కరెంట్ చార్జీలను విపరీతంగా పెంచారన్నారు. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలపై విద్యుత్ ఛార్జీల గుదిబండ మోపడం అన్యాయమన్నారు.
CPM Baburao on Electricity Charges hike: పెంచిన విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. అసలే కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలపై వైకాపా ప్రభుత్వం మరింత భారం మోపుతోందని ఆ పార్టీ నేత బాబురావు మండిపడ్డారు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక వారే ఛార్జీలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారం చేపట్టిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం పెంచిన ధరలపై వెనక్కి తగ్గకపోతే నాలుగో తేదీ నుండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని బాబురావు హెచ్చరించారు.
ఇదీ చదవండి : చంద్రబాబుకు మాత్రమే సైకో పాలనలా కనిపిస్తోంది : మంత్రి పెద్దిరెడ్డి