CPI: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను తక్షణమే బర్తరఫ్ చేసి, అతనిపై సీబీఐ విచారణ జరిపించాలని వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు, మహిళలపై నిరవధికంగా జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాకినాడలో వైకాపా ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ హత్యతో.. వైకాపా నాయకులు బడుగు బలహీన వర్గాలపై చేస్తున్న అఘాయిత్యాలు మరోసారి తెరపైకి వచ్చాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ నేర చరిత్ర కలవాడని అలాంటి వాళ్లకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిపెద్దల సభకు పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెదేపా నేత నక్కా ఆనంద బాబు మండిపడ్డారు. ఈ రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకంలేదని.. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ న్యాయవాది శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే 'చలో విజయవాడ' కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఆ వేగం.. ఇక్కడేదీ?
ఏదైనా హత్య జరిగినా, అనుమానాస్పద మృతి చోటుచేసుకున్నా అనుమానితులైన వ్యక్తుల్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తారు. హత్యలో వారి పాత్రపై స్పష్టత వస్తే వెంటనే అరెస్టు చేస్తారు. సుబ్రమణ్యం హత్యపై పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో సుబ్రమణ్యానిది హత్యేనని స్పష్టత వచ్చినా వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. కాకినాడలోని సర్పవరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి వెదురుపాక రాంబాబు (37) అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో అన్నవరపు లోవరాజు అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమైన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఎమ్మెల్సీ నిందితుడిగా ఉన్న కేసు విషయంలో జాప్యం చేయటానికి రాజకీయ పలుకుబడే కారణమన్న విమర్శలున్నాయి.
ఇవీ చదవండి: