ప్రజాస్వామ్యంలో మీడియాపై ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో ''మీడియాపై ఆంక్షలా'' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలోని జర్నలిస్టులపై జరుగుతున్న హత్యలు, దాడులను విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో... జర్నలిస్టుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించినా అవే చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా స్వేచ్ఛను హరించేందుకు 2007లో వచ్చిన 938 జీవోను అప్పటి ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. సీఎం జగన్ అదే జీవోను కొన్ని మార్పులతో తీసుకురావాలనే యోచనను విరమించుకోవాలని సూచించారు.
అనంతరం తెదేపా రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ... ప్రభుత్వం జర్నలిస్టులను బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంక్షలు విధించడం సరికాదని హితవు పలికారు.
ఇదీ చదవండీ... ఏపీ వాటర్ గ్రిడ్ కోసం నిధుల వేట... సమీకరణకు ప్రభుత్వం అనుమతి