CPI leader Narayana comments: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని, రైతుల ఉద్యమానికి అండగా నిలబడాలని.. విజయవాడలో జరిగిన 24వ సీపీఐ జాతీయ మహాసభల్లో ఏకగ్రీవంగా తీర్మానించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు తీర్మానం ప్రవేశపెట్టారు. మహాసభల్లో పాల్గొన్న 29 రాష్ట్రాల ప్రతినిధులు ఈ తీర్మానాన్ని ఆమోదించారు. రాజధాని కోసం రైతులు భూములిస్తే.. మూడు రాజధానుల పేరిట వైకాపా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం దారుణమని సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని.. జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. మూడు రాజధానుల పేరిట ప్రభుత్వం కృత్రిమ ఉద్యమం చేస్తోందని విమర్శించారు. విశాఖ భూకుంభకోణంపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
రాజధాని రైతుల పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని.. జాతీయ కార్యవర్గ సభ్యుడు అతుల్‌కమార్ అంజద్ తెలిపారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో ప్రభుత్వం అలజడులు సృష్టిస్తోందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ఐకాసలో మంత్రులు, వైకాపా నాయకులు తప్ప.. రాష్ట్రంలో ఇతర పార్టీలేవైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.
"రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఉద్రిక్తత పరిస్థితులు తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకోవడం సరికాదు. జనసేన నాయకులపై 307 సెక్షన్ కింద కేసులు అన్యాయం. ప్రతిపక్ష పార్టీలను చూస్తే జగన్కు ఎందుకంత భయం?. విశాఖ గర్జన పూర్తిగా విఫలమైంది. అందుకే పిచ్చిపట్టిన వారిలా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. వైకాపా నాయకులు, మంత్రులు తప్ప ఆ గర్జనలో ఎవరూ లేరు. రాష్ట్రంలో ఒక్క పార్టీ అయినా మూడు రాజధానులకు మద్దతుగా వచ్చారా? అమరావతి రాజధానిగా వద్దని ప్రకటించిన రోజే ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు ఉత్తరాంధ్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. అమరావతి రాజధాని అంశాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళతాం." -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అమరావతికి భూములిచ్చిన రైతుల న్యాయమైన పొరాటంలో అండగా ఉంటామని సీపీఐ నేతలు తెలిపారు. అమరావతి రాజధానిగా ఉండాలనే నినాదాన్ని దేశ వ్యాప్తంగా వినిపిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: