రాష్ట్రంలో పర్యటిస్తున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత విధానాలతో భారత ప్రజాస్వామ్యం చిక్కుల్లో ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దేశానికి అంత మంచివి కాదని తెలిపారు. అధ్యక్ష వ్యవస్థ మంచిది కాదని అంబేడ్కర్ ఆరోజుల్లోనే చెప్పారని ఆయన గుర్తుచేశారు. అధ్యక్ష వ్యవస్థకు ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుందని తెలిపారు. నీతిఆయోగ్ వచ్చాక ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేటు పరమవుతున్నాయని... రక్షణ రంగం, రైల్వే వంటివి ప్రైవేటుపరం కానున్నాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగం అనేది దేశంలో అతిపెద్ద సమస్యగా ఉందన్నారు.
కశ్మీర్‌లో పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయని రాజా అన్నారు. 370 అధికరణాన్ని రద్దు చేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. రానున్నరోజుల్లో కశ్మీర్‌లో పరిస్థితులు దారుణంగా మారనున్నాయని తెలిపారు. సీపీఐ జాతీయ స్థాయి హోదా రద్దు చేస్తున్నట్లు ఈసీ ఉత్తర్వులిచ్చిందన్న రాజా... ఎన్నికల సంఘం ఉత్తర్వులకు సమాధానం ఇచ్చామని తెలిపారు. ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలన్నారు. కాంగ్రెస్‌ను జాతీయ పార్టీగా గుర్తిస్తే సీపీఐనీ గుర్తించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు ముందు నుంచి సీపీఐ పార్టీ మనుగడలో ఉందని ఆయన తెలిపారు. ఏ పార్టీ అయినా గెలుపు, ఓటములు సహజం అని... భాజపా ఒక దశలో కేవలం ఇద్దరు ఎంపీలతో ఉందని ఆయన గుర్తుచేశారు.