కరోనా వైరస్ బారినపడి మూడు వారాల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు. ఈ విషాద ఘటన విజయవాడలో జరిగింది. జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ఉపాధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది సయ్యద్ ముజాహిద్ సుల్తాన్ మూసవి, అతని తల్లి, భార్య, కుమారుడు నెల రోజుల కిందట కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక్కొక్కరుగా చనిపోయారు. వైరస్ కారణంగా 20 రోజుల కిందట సుల్తాన్ తల్లి ఫాతిమా చనిపోయారు. ఆయన భార్య లుబ్నా శుక్రవారం కన్నుముశారు. సుల్తాన్ కూడా శనివారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచారు. వీరి కుమారుడు జావీద్ ఆదివారం ఉదయం మృత్యువాడపడ్డారు. జావీద్‌కు చిన్నప్పటి నుంచి పక్కటెముకల సమస్య ఉండటంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఆస్ట్రేలియాలో ఉంటున్న సుల్తాన్ కుమార్తె... తన తల్లి మరణ వార్త తెలిసి ఆదివారం విజయవాడకు చేరుకున్నారు. వచ్చేలోగానే తండ్రి, సోదరుడు కూడా చనిపోవటంతో ఆమె వేదన వర్ణనాతీతంగా మారింది. లుబ్నా అంత్యక్రియలను బంధువులు శనివారం ఉదయం నిర్వహించి వస్తుండగా.. సుల్తాన్ చనిపోయిన విషయాన్ని వైద్యులు తెలిపారు. సుల్తాన్ అంత్యక్రియలకు ఆదివారం ఏర్పాట్లు చేస్తుండగా.. కుమారుడు జావీద్ కూడా కన్నుమూసినట్టు చెప్పటంతో కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.
ఇదీ చదవండి