కరోనా ప్రభావం విద్యారంగంపై తీవ్రంగా పడింది. ఇప్పటికే మొదలవ్వాల్సిన పరీక్షలు వాయిదా పడగా... వాటిని ఎప్పుడు నిర్వహిస్తారనే వాటిపై స్పష్టత లేని పరిస్థితి ఏర్పడింది.
పరీక్షలపైనా అస్పష్టత
పదోతరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ స్పష్టత రాలేదు. మే నెల మూడు, నాలుగు వారాల్లో పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నా అది లాక్‌డౌన్‌పై ఆధారపడి ఉంది. పరీక్షలు పూర్తయ్యాక ఫలితాల ప్రకటనకు మరో 25రోజుల సమయం ఉంటుంది. అనంతరం ముందస్తు సఫ్లిమెంటరీ నిర్వహించాలి. ఈ ఫలితాల మీదే ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఏపీఆర్‌జేసీ ప్రవేశాలు ఆధారపడతాయి.
ఇంటర్ ఫలితాలు మేలోనే
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం మధ్యలో నిలిచిపోయింది. ఏటా ఏప్రిల్ రెండోవారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేసేవారు. మేలో ముందస్తు సఫ్లిమెంటరీ పరీక్షలుండేవి. ఈసారి ఫలితాలే మే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది.
ఇంజినీరింగ్ పరీక్షలు పూర్తికాలేదు. చివరి ఏడాది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందినా బీటెక్ పట్టా ఆలస్యంగా రానుంది. ఇది ఉద్యోగాల్లో చేరే సమయంపైనా ప్రభావం చూపనుంది.
ఏపీ ఎంసెట్ ఫలితాలను గతేడాది మే 5న విడుదల చేశారు. ఈసారి పరీక్షలే మే రెండోవారం తర్వాత ఉండే అవకాశం ఉంది. ఫలితాలు, కౌన్సెలింగ్‌కు కలిపి మరో నెలరోజులు పైనే పడుతుంది. ఫలితంగా ఆగస్టులోనే తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.