తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత వారం రోజుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ రావటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇప్పటికే ఒకరు కోలుకుని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా పాజిటివ్ వచ్చిన రోగి సహా నలుగురు గాంధీలో చికిత్స పొందుతున్నారు. నిన్న మొత్తం 40 శాంపిళ్లను సేకరించగా అందులో 21మందికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఒకరు పాజిటివ్ కాగా.. మరో 18మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 432 మంది శాంపిళ్లను సేకరించారు. నిన్న ఒక్క రోజే హోం క్వారంటైన్‌కి వెళ్లిన వారి సంఖ్య 662కావటం గమనార్హం.
క్వారంటైన్ ఏర్పాట్లు పూర్తి..
వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందస్తు ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చే వారిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా వికారాబాద్ లోని హరితా రిసార్టుకు తరలిస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున.. దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీ, గచ్చిబౌలి స్టేడియాలలో క్వారంటైన్ ఏర్పాట్లు పూర్తి చేశారు.
విమానాలను రద్దు చేసే అవకాశం..
ఇక కరోనా పరీక్షల కోసం ఉస్మానియా, గాంధీతో పాటు.. ఫీవర్ ఆస్పత్రి, ఐపీఎం, ఎంజీఎం, నిమ్స్ ఆస్పత్రులు కలిపి మొత్తం ఆరు వైరాలజీ ల్యాబులను సన్నద్ధం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా నిర్ధరణ అయిన ఐదుగురు రోగులు కూడా విదేశాల నుంచి వచ్చిన వారే కాబట్టి.. అంతర్జాతీయ ప్రయాణాలను నిలిపివేయాలని కేంద్రానికి సూచించినట్టు మంత్రి ఈటల తెలిపారు. నేటి నుంచి వైరస్ తీవ్రంగా ఉన్న చైనా, ఇరాన్, ఇటలీ, జర్మనీ వంటి దేశాల నుంచి విమానాలను రద్దు చేసే అవకాశం ఉందని ఈటల పేర్కొన్నారు.
మానవత్వంతో వ్యవహరించాలి..
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని కాస్తంత ముందస్తు జాగ్రత్త చర్యలతో దీనిని కట్టడి చేయవచ్చని ప్రజలకు మంత్రి ఈటల సూచించారు. మరోవైపు దూలపల్లి, వికారాబాద్ పరిసర ప్రాంతల ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన మంత్రి.. ఆయా ప్రాంతాల్లో కరోనా రోగులను ఉంచటం లేదన్న విషయాన్ని గుర్తించి.. మానవత్వంతో వ్యవహరించాలని కోరారు.
ఇవీ చూడండి: కరోనా మృతదేహాల ఖననంపై కేంద్రం మార్గదర్శకాలు