తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కేసుల సంఖ్య 59కి చేరింది. వీరిలో తొలి కరోనా బాధితుడు కోలుకొని ఇంటికెళ్లగా, మిగిలిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ ఉన్నట్లు శుక్రవారం గుర్తించిన వారిలో ఓ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యుడి తల్లి కూడా ఉన్నారు. వైద్యులైన భార్యాభర్తలతోపాటు వారి కుటుంబంలో ఇప్పుడు తల్లికి కూడా సోకినట్లయింది. ఆ వైద్యుడి తండ్రికి, ఇద్దరు చిన్నారులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.
మరింత మంది..?
శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో.. మరొకరు అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 76 ఏళ్ల వృద్ధుడిగా నిర్ధరించారు. మిగిలిన 12 మంది కరోనా బాధితుల సమాచారం తెలియాల్సి ఉంది. వారిలో అత్యధికులు వేర్వేరు దేశాల నుంచి తెలంగాణకు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులు, వారితో కలివిడిగా గడిపిన కుటుంబ సభ్యులు, సన్నిహితులే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 13కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు