రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చెయ్యాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్‌చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన దేశ వ్యాప్త పిలుపునకు సంఘీభావం ప్రకటించారు. ప్రధాని మోదీ రైతు వ్యతిరేక విధానాలు నశించాలన్నారు. మోదీ కార్పొరేట్లకు, బడా వ్యాపారులకు అనుకూలంగా తెచ్చిన విధానాలపై నినదించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన దేశవ్యాప్త పిలుపునకు సంఘీభావం ప్రకటించారు.
కడప జిల్లాలో..
కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి నల్ల బ్యాడ్జీలు ధరించి నల్లచట్టాలకు నిరసనగా తులసి రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నల్లచట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తెచ్చిన చట్టాలు తేనె పూసిన కత్తుల్లాంటివని అన్నారు. ఈ చట్టాలు అమలైతే మార్కెట్ యార్డులు, కమిటీలు, మార్కెట్ సెస్సులు ఉండవని పేర్కొన్నారు. గత 6 నెలలుగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు పోరాటం చేస్తున్నప్పటికీ మోడీ ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు పూర్తి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం ఉందన్న తులసి రెడ్డి.. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. రైతుల చేతులకు బేడీలు వేసిందన్నారు. జగన్ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి సున్నం కొట్టిందని, పావలా వడ్డీ పథకానికి పాడె కట్టిందని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు జీవో 22 జారీ చేసిందని అన్నారు.
ఇవీ చదవండి:
బాంబులతో దాడి చేసి.. రూ.11లక్షలు చోరీ
మూడేళ్ల తర్వాత ఎవరుంటారన్నది.. పోలీసులు గుర్తు పెట్టుకోవాలి: చంద్రబాబు