Polavaram authority: పోలవరం ప్రాజెక్టు అథారిటీలో పనిచేస్తున్న 8 మంది ఇంజినీర్లను జలవనరులశాఖ బదిలీ చేసింది. కానీ వారిని రిలీవ్ చేయడానికి అథారిటీ ఉన్నతాధికారులు ఇష్టపడట్లేదు. దీంతో ఆ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పోలవరం అథారిటీ పర్యవేక్షిస్తోంది. అక్కడ కీలక స్థానాల్లో ఉన్నవారంతా కేంద్ర జలసంఘం అధికారులే. మిగిలిన 11 మంది ఏపీ జలవనరుల శాఖలో పని చేస్తారు. వారిని ఏపీ ప్రభుత్వం అక్కడకు డిప్యుటేషన్‌పై బదిలీ చేసింది.
ప్రస్తుతం అందులో ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, మరో ఏడుగురు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను జలవనరులశాఖ ఉన్నతాధికారులు బదిలీచేసి, వారికి ఆన్‌లైన్‌లో ఉత్తర్వులు పంపారు. అంతకుముందు ఇచ్చిన డిప్యుటేషన్ ఉత్తర్వులన్నీ రద్దుచేసినట్లు పేర్కొన్నారు. ఉత్తర్వులు అందుకున్న వారంలోగా వారు రిలీవ్ అయ్యి, కొత్త పోస్టులో చేరాలి. ఈ గడువు బుధవారంతో ముగుస్తోంది. దీంతో.. బదిలీ అయినవారు తమను రిలీవ్ చేయాలని అథారిటీ అధికారులను కోరగా, వారు ససేమిరా అంటున్నారు.
తాము ఏపీ జలవనరులశాఖ కార్యదర్శికి లేఖ రాస్తామని, ఇక్కడి నుంచి వెళ్లేందుకు వీల్లేదని అడ్డు పడుతున్నారు. తాము సకాలంలో తమ స్థానాల్లో చేరకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఆ ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. జులై నెల జీతాలు రావడమూ ఇబ్బందేనని చెబుతున్నారు. పోలవరం అథారిటీ అధికారులతో జలవనరులశాఖ అధికారులు సమన్వయం చేసుకోకపోవడం వల్లే ఈ సమస్యలు ఎదురయ్యాయి.