తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనప్రాయంగా తెలిపారు. వార్షిక పద్దు అంచనాలు, కేటాయింపుల కోసం విధి విధానాలు ఖరారయ్యాయని సీఎం తెలిపారు. బడ్జెట్ సమావేశాలు మార్చి నెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీఎం వెల్లడించారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలపై సీఎం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా నిర్వహించారు. శాఖలవారీగా ఆర్థికపద్దు అంచనాలను, అధికారులు అందించిన ఆర్థిక నివేదికలను పరిశీలించారు.
కరోనా ప్రభావంతో..
కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని... ఆ ప్రభావం లక్ష కోట్లకు చేరుకున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుని రాబడి పెరిగిందని...ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు ఎక్కువగానే ఉండే ఆస్కారముందని సీఎం పేర్కొన్నారు. ఆదివారం నుంచి శాఖలవారీగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ... ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమావేశాలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు.
ఆ కార్యక్రమాలు కొనసాగిస్తాం..
పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో వున్న గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ కార్యక్రమాలను కొనసాగిస్తామని సీఎం తెలిపారు. గొర్రెల పంపిణీ పథకాన్ని కేంద్రం ప్రశంసించి...దేశంలోనే అత్యంత గొర్రెలసంఖ్య ఉన్న రాష్ట్రంగా గుర్తించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఇప్పటివరకూ పంపిణీ చేసిన 3 లక్షల 70వేల యూనిట్లకు కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీకి బడ్జెట్‌లో ప్రతిపాదనలు పొందుపర్చనున్నామని వెల్లడించారు. అన్ని శాఖలతో బడ్జెట్‌పై కసరత్తు ముగిసిన తరువాత తుదిదశలో ముఖ్యమంత్రి అధ్యక్షతన బడ్జెట్‌కు తుదిమెరుగులు దిద్దనున్నారు.
ఇదీ చదవండి: గరుడ వాహనంపై ఊరేగిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి