CM JAGAN REVIEW ON PROJECTS : జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పోలవరం సహా ప్రాధాన్యతా ప్రాజెక్టులపై చర్చించారు. ముందస్తు వరదలు రావడంతో..... పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలపై సమీక్ష చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణంలో ఏర్పడ్డ గ్యాప్1, గ్యాప్ 2లు పూడ్చే పనులపై సమావేశంలో చర్చించారు. రెండు గ్యాప్‌లను పూడ్చే పనులను నిర్ధారించడానికి 9 రకాల పరీక్షలు అవసరమని తెలిపారు. వరదలు తగ్గాక ఈ పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. వరద వల్ల దిగువ కాఫర్ డ్యాం పనులకు అంతరాయం ఏర్పడిందని.. గోదావరిలో వరద కనీసంగా 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితే గాని పనులు చేయడానికి అవకాశం ఉండదని అధికారులు వివరించారు. వరదలు తగ్గితే ఆగస్టు మొదటి వారంలో.. పనులు తిరిగి ప్రారంభించే అవకాశం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం రూ.2,900 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉందని.. సత్వరమే వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలవరం పనులు వేగవంతంగా చేయడానికి 6వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు లేఖలు రాయాలని సీఎం ఆదేశించారు.
ఆగస్టులో సంగం బ్యారేజీ ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దసరా నాటికి అవుకు టన్నెల్-2 సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో.. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2ను పూర్తిచేసి జాతికి అంకితం చేయాలని.. ఈ మేరకు పనులు పూర్తి చేయాలన్నారు. వంశధార ప్రాజెక్టు స్టేజ్-2పనులు పూర్తికావొచ్చాయని.. అక్టోబరులో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. మొత్తం 27ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలని సీఎం నిర్దేశించారు.
కర్నూలు పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. దశాబ్దాల తరబడి ఈ ప్రాంతం వెనకబడిందని, ఇక్కడ నుంచి వలసలు నివారించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. భూమిలేని వారికి కనీసం ఒక ఎకరా భూమి ఇవ్వాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలో ఇరిగేషన్, తాగునీటి పథకాలు పూర్తి చేయాలని.. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి: