Tasty Lunch in Schools: ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు కింద జరుగుతోన్న పనులు ప్రగతిపై ఆరా తీశారు. పనులు చేయటం ఎంత ముఖ్యమో.. స్కూళ్ల నిర్వహణ కూడా అంతే ముఖ్యమని సీఎం అధికారులకు సూచించారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందన్నారు. నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించాలన్నారు. ఆహారాన్ని రుచిగా వండటంపై వంట మనుషులకు తగిన తర్ఫీదు ఇవ్వాలన్నారు. క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు జరగాలని సూచించారు. స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణలో హెచ్‌ఎం, గ్రామ సచివాలయ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. స్కూళ్లకు, అంగన్‌వాడీలకు బియ్యాన్ని సరఫరా చేసే ముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలన్నారు. సరఫరా చేసే బియ్యం బ్యాగులపై కచ్చితంగా మధ్యాహ్నం భోజనం లేదా ఐసీడీఎస్ బియ్యంగా లేబుల్స్ వేయాలన్నారు. చిక్కీల నాణ్యతపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్న సీఎం.. తయారీ దారుల వద్ద, సరఫరా సమయంలోనూ, పిల్లలకు పంపిణీ చేసేటప్పుడు ఈ మూడు దశల్లోనూ నాణ్యతపై ర్యాండమ్ పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు. స్టాంపింగ్ లేకుండా గుడ్లు పంపిణీ చేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
నాడు–నేడు తొలిదశ కింద పనులు జరిగిన స్కూళ్లపై ఆడిట్ చేయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులను వాడుకుని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. క్రమం తప్పకుండా ప్రతి యేటా నాలుగు సార్లు ఆడిట్ చేయాలన్నారు. నాడు–నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో సదుపాయాల భద్రత కోసం వాచ్‌మెన్‌ను నియమించాలన్నారు. గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలనూ వినియోగించుకోవాలన్నారు. స్కూళ్ల నిర్వహణపై అంతిమంగా కలెక్టర్లు, జేసీలే బాధ్యత వహించాలన్నారు. స్కూళ్ల నిర్వహణపై ఒక కాల్‌సెంటర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలన్న సీఎం.. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. స్కూళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేసినా అవి పని చేయడం లేదన్న మాట ఎక్కడా రాకూడదన్నారు.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణపోషణ ప్లస్ కార్యక్రమంపై సమీక్షించిన సీఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సంపూర్ణపోషణపై పర్యవేక్షణ ఉండాలన్న ఆయన.. అందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి