CM JAGAN REVIEW ON COVID: రాష్ట్రంలో ప్రస్తుతం 300 టన్నుల ఆక్సిజన్ తయారీ సామర్థ్యం ఉందని, తాజాగా నోవా ఎయిర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రోజుకు 220 టన్నులు అదనంగా అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో నోవా సంస్థ నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంటును గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘కొవిడ్ కారణంగా మెడికల్ ఆక్సిజన్ అవసరాన్ని గుర్తించి రోజుకు 220 టన్నుల ప్రాణవాయువు తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలని భావించాం. 2020 జనవరి 24న నోవా ఎయిర్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. డిసెంబరులో పనులు ప్రారంభించి, 14 నెలల్లో పూర్తిచేసింది. ఇంత తక్కువ వ్యవధిలో ప్లాంట్ ప్రారంభించడం విశేషమ’ని ప్రశంసించారు.
సురక్షితంగా.. ప్రకృతి హితంగా
నోవా ఎయిర్ ఎండీ గజానన్ నబర్ మాట్లాడుతూ ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి సహకారం అందించిందని కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి హిత చర్యలతో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ప్లాంటు నెలకొల్పామని, వినియోగదారుల నమ్మకాన్ని నిలబెడతామని చెప్పారు. రూ.130 కోట్ల పెట్టుబడితో 150 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో నెలకొల్పిన ఈ ప్లాంటులో మెడికల్ ఆక్సిజన్‌తో పాటు ద్రవరూప ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్ వాయువులు ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఏపీ ఇండస్ట్రియల్ గ్యాస్, మెడికల్ ఆక్సిజన్ తయారీ నూతన పారిశ్రామిక విధానానికి స్పందించిన మొదటి అతిపెద్ద పారిశామ్రిక గ్యాస్ పరిశ్రమ నోవా ఎయిర్ అని గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని, నోవా ఎయిర్ డైరెక్టరు ఎస్.రాయ్ చౌదరి, శ్రీసిటీ జీఎం (కమర్షియల్ అఫైర్స్) సీహెచ్.రవికృష్ణ పాల్గొన్నారు.
కొవిడ్ సంరక్షణ కేంద్రాల్లో సదుపాయాలు బాగుండాలి: సీఎం
కొవిడ్ సంరక్షణ కేంద్రాల్లో బాధితులకు మంచి సదుపాయాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కొవిడ్ నియంత్రణ చర్యలపై సీఎం జగన్ గురువారం సమీక్షించారు. ‘ఆస్పత్రుల్లో చేరే వారిలో అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించాలి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ అమలుతీరు దేశంలోనే స్ఫూర్తిగా ఉండేలా అధికారుల చర్యలు తీసుకోవాలి. బీమా సంస్థలు అందచేసే ధరల కంటే ఆరోగ్యశ్రీ కింద అందించే చికిత్సలకు ప్రభుత్వం ఇచ్చే రేట్లు బాగున్నాయి’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని (వైద్య ఆరోగ్య శాఖ) పాల్గొన్నారు
.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విజృంభణ- ఒక్కరోజే 13,474 కరోనా కేసులు, 9 మరణాలు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!