నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. హానికారక వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వ్యర్థాల తొలగింపు కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రేడ్ 2, గ్రేడ్ 3 నగర పంచాయతీలకు క్లాప్ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ ఆయా నగరాలకు, పట్టణాలకు, నగర పంచాయతీలకు, పంచాయతీలకు చేరవేయాలన్నారు.
ప్రతి ఇంటికి చెత్త బుట్టలు
గ్రామీణ ప్రాంతాల్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు, పట్టణ ప్రాంతాల్లో 72 చోట్ల ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. జూన్ 2022 నాటికి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు చెత్త సేకరణకు 30 లక్షల చెత్త బుట్టలు సరఫరా చేశామని తెలిపారు. ప్రతి ఇంటికి చెత్త బుట్టలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సంబంధిత కంపెనీలతో మాట్లాడి ఆయా వాహనాలను సత్వరమే తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరాలు, పట్టణాల్లో చెత్త తరలించే స్టేషన్ల నుంచి సమీపంలోని ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడం సహా ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి
గుంటూరులో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం సిద్ధమైందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రతిపాదిత ప్రాంతాల్లోనూ ఈ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పబ్లిక్ టాయిలెట్ నిర్వహణపైనా అధికారులు దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. పబ్లిక్ టాయిలెట్స్‌ను నిర్మించడంపైనే కాకుండా వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విలేజ్ క్లినిక్స్ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యంపైనా నివేదికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంకులను పరిశుభ్రం చేయించాలని సీఎం ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టి పెట్టాలని సూచించారు.
మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు
మురుగునీటి కాల్వల నిర్వహణపైనా అధికారులు దృష్టి సారించాలని సీఎం అధికారులకు సూచించారు. ఎక్కడా మురుగునీరు నిల్వ లేకుండా చేయాలని.., దీన్ని సవాల్‌గా తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను పాటించాలని ఆదేశించారు. క్లాప్ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్ కంట్రోల్ రూంలో సమర్ధులైన అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
"రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. హానికారక వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. విలేజ్ క్లినిక్స్ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలి. నివేదికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. మురుగునీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టాలి. నివాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చేయాలి. మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలి"- జగన్, ముఖ్యమంత్రి
ఇదీ చదవండి