జీతాలు పెంచాలంటూ గ్రామ, వార్డు వాలంటీర్లు ఆందోళనలకు దిగడంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈమేరకు 2 పేజీల బహిరంగ లేఖ రాసిన సీఎం..వాలంటీర్లు నిరసనలకు దిగడం ఎంతో బాధించిందన్నారు. రెండున్నర లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు కీలకమైన బాధ్యతలు అప్పగించామని... లంచాలు లేని, వివక్ష లేని, విశ్వసనీయ పరిపాలన కోసం ఈ వ్యవస్థను తీసుకొచ్చామని స్పష్టంచేశారు. ప్రభుత్వ సేవలను ఇంటి ముంగిటకు అందించేలా, పార్టీలు- కులమతాలకు అతీతంగా వాలంటీర్ల ఎంపిక జరిగిందన్నారు. అయితే కొద్దిమంది చేస్తున్న కుట్రలతో...గ్రామ, వార్డు వాలంటీర్లు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంత సామాన్య ప్రజలంతా..వాలంటీర్లను ఆప్తులుగా, ఆత్మీయులుగా చూస్తున్నారని అన్నారు. జీతాలు తీసుకుని పని చేస్తే ఏ ఒక్కరైనా గౌరవిస్తారా అని తమను తాము ప్రశ్నించుకోవాలని వాలంటీర్లకు సీఎం సూచించారు. స్వచ్ఛందంగా కాకుండా, జీతాల కోసం పనిచేస్తే ఇంతటి గౌరవం రాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. గొప్ప సేవలందిస్తున్న వాలంటీర్లకు సమాజం నమస్కరిస్తోందని, ప్రభుత్వం కూడా సత్కరిస్తోందని చెప్పారు. నియోజకవర్గం ప్రాతిపదికన ఏటా ఒకరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీల సమక్షంలో శాలువా కప్పి అవార్డు ఇవ్వాలని భావిస్తుంటే..ఆ గౌరవాన్ని దక్కనీయకుండా కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు.
వాలంటీర్లకు ఉన్న మంచిపేరును చెడగొట్టేందుకు, మొత్తంగా వ్యవస్థనే లేకుండా చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని...ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా కర్తవ్యాన్ని నిర్వహించాలని శ్రేయోభిలాషిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: లోకల్ ఫైట్: తొలి విడతలో పోలింగ్ శాతం ఎంతంటే..?