New Districts: కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య.. 13 నుంచి 26కు పెరిగాయి. ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో జిల్లాలను ప్రారంభించారు. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు. గ్రామాల నుంచి రాజధాని వరకు వికేంద్రీకరణే తమ విధానమని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన పాలన అందుతుందన్నారు. పునర్విభజన తర్వాత రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కు చేరింది. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఏర్పడ్డాయి.
మంచి పనికి శ్రీకారం చుట్టాం: కొత్త జిల్లాల ఏర్పాటుతో మంచి పనికి శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. గిరిజన సెంటిమెంట్, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగం, సేవాభావం, వాగ్గేయకారుల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా కొత్త జిల్లాల పేర్లు పెట్టామని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. గతంలో పరిపాలనా సంస్కరణలు, వికేంద్రీకరణ విషయంలో బాగా వెనుకబడిన రాష్ట్రంగానే మనం మిగిలిపోయామన్న సీఎం.. దీని నివారణకే జిల్లాల పునర్విభజన చేసినట్లు తెలిపారు. ఇవాల్టి నుంచి 13 నుంచి 26 జిల్లాలు చేయడంతో ఇంతక ముందు 38.15 లక్షల మందితో జిల్లాలు ఇప్పుడు సగటున 19.7 లక్షల మందితో ఏర్పడ్డాయని తెలిపారు. ఒక్క గిరిజన జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలను 6 నుంచి 8 అసెంబ్లీ స్ధానాలతో ఒక జిల్లా రూపొందించామని వెల్లడించారు. 18 నుంచి 23 లక్షల మధ్య జనాభా ఉండేలా పునర్‌వ్యవస్ధీకరణ చేసినట్లు వివరించారు.
పాలనలో సంస్కరణలు: పరిపాలనలో మౌలిక మార్పులకు, సంస్కరణలు చేపట్టినట్లు సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో గడపగడపకూ పరిపాలనను చేరువ చేసినట్లు వ్యాఖ్యనించారు. వికేంద్రీకరణ ద్వారా ప్రతి 2 వేల మందికీ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, 15,004 సచివాలయాల ద్వారా విజయవంతంగా సేవలందిస్తున్న తొలి రాష్ట్రం ఏపీ అని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాలు, మిగిలిన కేంద్రాలు అన్నీ ఒకే చోటుకు వస్తాయన్నారు. కనీసం 15 ఎకరాల విస్తీర్ణంలో అన్నీ ఒకేచోట ఏర్పాటు కాబోతున్నాయని వెల్లడించారు. వీటిని ఇంటిగ్రేటెడ్‌గా ఏర్పాటు చేస్తే.. అన్ని కార్యాలయాలూ ఒకే చోట ఉంటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజల విజ్ఞప్తుల మేరకు జిల్లాలో మార్పులు, చేర్పులు చేయడం జరిగిందన్నారు. తొలుత నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేశామని. ఇందులో కూడా 12 నియోజకవర్గాల్లో మండలాలను కొద్దిగా విభజించి కొన్ని మండలాలను ఒక జిల్లాలోనూ, కొన్ని మండలాలను మరొక జిల్లాల్లోనూ ప్రజల ఆకాంక్షల మేరకు చేర్చాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు. 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపు మారింది. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయి, 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడుకున్నాం. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పడింది. 1979 జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పడింది. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు. కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగింది. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు అవసరం. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని మార్పులు. -వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
ప్రజలకు మెరుగైన పాలన: పరిపాలనకు సంబంధించి డీసెంట్రలైజేషన్ అనేది ప్రభుత్వ విధానమని సీఎం జగన్ స్పష్టం చేశారు. గ్రామం నుంచి రాజధానుల వరకూ అదే తమ విధానమన్నారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుపడతాయన్నారు. కొత్త జిల్లాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతిభద్రతలు, పారదర్శకత లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: new districts : నేటి నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు