CJI Justcie NV Ramana: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ గౌరవార్థం... రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. రాజ్‌భవన్‌కు విచ్చేసిన జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు సీజేఐకి గౌరవ వందనం సమర్పించారు. జస్టిస్ ఎన్.వి.రమణ కంటే కొద్ది సమయం ముందే రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు ఎదురెళ్లి రాజ్‌భవన్ దర్బారు హాలులోకి తోడ్కొని వచ్చారు. అనంతరం దర్బారు హాలులో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌లు భేటీ అయి సమకాలీన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జేకే మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన సతీమణి వై.ఎస్.భారతి ఈ విందుకు హాజరయ్యారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి, న్యాయమూర్తులతో కలిసి గ్రూపు ఫొటో తీసుకున్నారు.
సమాజానికి న్యాయవాదులు మార్గదర్శకులు..
న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులని.. ప్రజా హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి వారంతా కృషి చేస్తుండటం హర్షణీయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ ప్రశంసించారు. మీ శక్తిసామర్థ్యాలు, జ్ఞానం, విజ్ఞానం సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని ఆయన న్యాయవాదులకు పిలుపునిచ్చారు. ఆదివారం నేలపాడు వద్ద హైకోర్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్‌సీఏఏ), ఏపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులను ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి, గజమాలతో సత్కరించి, జ్ఞాపిక, సన్మానపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ.. ‘ఏపీ హైకోర్టులో పెండింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. న్యాయమూర్తుల కొరత ఉంది. వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. వీలైనంత త్వరలో కొత్త జడ్జిలను నియమించే అవకాశం ఉంది. మిగిలిన ఖాళీల భర్తీకి పేర్లు పంపిస్తే ఆమోదిస్తామంటూ ఏపీ హైకోర్టు సీజేకు లేఖ రాశాం’ అని చెప్పారు. ‘ఈ పర్యటనలో మీరంతా చూపిస్తున్న అభిమానం, ఆదరణ, ప్రేమ, ఆప్యాయతలకు సర్వదా కృతజ్ఞుడిని. ప్రతి ఒక్కరూ శాలువా కప్పాలనో, దండ వేయాలనో, ఫొటో తీసుకోవాలనో ప్రయత్నిస్తున్నారు. దయచేసి అలాంటి తాపత్రయం వద్దు. ఎందుకంటే నేను మీ ప్రాంతం వాడినే. సీజేఐ అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చి అందరినీ కలవడం సంతోషంగా ఉంది. తెలుగువాడిగా భారతదేశ న్యాయవ్యవస్థ కీర్తిని మరింత ఇనుమడింపజేస్తా’ అని పేర్కొన్నారు. ‘నేను సీజేఐ అయినప్పుడు మీరందరూ సంతోషించారు. చాలామంది మిత్రులు దిల్లీ రావడానికి ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ కొవిడ్ కారణంగా మనం కలవలేకపోయాం. ఇకపై అందరూ కొవిడ్ నిబంధనలు పాటించండి. మాస్క్‌లు ధరించండి’ అని కోరారు.
న్యాయవాదులకు స్ఫూర్తి ప్రదాత
తొలుత జస్టిస్ ఎన్.వి.రమణ, సహచర న్యాయమూర్తులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏపీహెచ్‌సీఏఏ అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు అధ్యక్షతన సీజేఐ సన్మాన కార్యక్రమం జరిగింది. సీజేఐ దంపతులతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్.నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రను నిర్వాహకులు సన్మానించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత, ఏపీ ఏజీ శ్రీరామ్, న్యాయవాదులు పాల్గొన్నారు. గంటా రామారావు మాట్లాడుతూ.. జస్టిస్ ఎన్.వి.రమణ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత న్యాయశిఖరాలను అధిరోహించడం తెలుగువారికి గర్వకారణమని, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని పేర్కొన్నారు. జానకిరామిరెడ్డి మాట్లాడుతూ.. జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయవాదులకు స్ఫూర్తిప్రదాత అని కొనియాడారు. కష్టపడే తత్వమే ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేర్చిందని చెప్పారు. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులను రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన బార్ అసోసియేషన్ల ప్రతినిధులు, ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, న్యాయవాదులు, ఉద్యోగులు సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
ఇదీ చదవండి :
CJI NV Ramana: హైకోర్టులో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ