Civil Supplies Department: ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ జరుగుతోందన్న ప్రచారం వాస్తవం కాదని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులు నష్టపోకూడదనే రైతు భరోసా కేంద్రాలు పెట్టామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తూ రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. వంద శాతం మేర ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ఈకేవైసీలో జరుగుతున్న జాప్యం గురించి మాత్రమే ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో సీఐడీ విచారణ చేపట్టాల్సినంత తప్పులు జరగలేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు.
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏమన్నారంటే: ధాన్యం రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా సమీక్షా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరుగుతోందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 17వేల మంది రైతులను ఆధార్ లింక్ చేయకుండా రైస్ మిల్లుల యజమానులు, అధికారులు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. సీఐడీ విచారణ కోరతానని వెల్లడించారు.
పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్: తూర్పుగోదావరి జిల్లాలో ఈకేవైసీ చేసుకోని రైతుల గురించి మాత్రమే ఎంపీ సుభాష్ మాట్లాడారని పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ పేర్కొన్నారు. మొత్తం 68 వేల మంది రైతులుంటే... అందులో 51 వేల మందికి మాత్రమే ఈకేవైసీ నమోదైందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 1.52 వేలమంది రైతులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఎంపీ సుభాష్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం కోరామని... ఆయన చెప్పినట్లు ఈకేవైసీ ద్వారా అవకతవకలకు ఆస్కారం లేదని వివరించారు. నాలుగు ఎకరాల పొలం ఉంటే రెండు ఎకరాలు నమోదు చేసి.. మిగిలిన దాన్ని ఇతరుల పేర్లపై చెల్లింపు జరగదని తేల్చిచెప్పారు.
పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్: ఆర్బీకేల ద్వారా మాత్రమే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగానే ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ సీజన్లోనూ రైతుల ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. మిల్లర్‌కు నేరుగా ఎక్కడా చెల్లింపులు జరగటం లేదని... రైతులకు బదులుగా ఎవరికైనా చెల్లింపులు చేస్తే ఉపేక్షించమని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకే ధాన్యానికి మద్ధతు ధర చెల్లిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: